సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొంతమంది ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న సందర్భాలు అనేకం. రోడ్లు, మెట్రో స్టేషన్లు, పార్కులు, షాపింగ్ మాల్స్, ప్రమాదకర ప్రాంతాల్లో రీల్స్ చేస్తూ సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా, ఓ మహిళ రీల్స్ కోసం రోడ్డుపై డ్యాన్సు చేస్తుండగా.. బైక్‌పై వచ్చిన దొంగ ఆమె మెడలో గొలుసును లాక్కెళ్లాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితురాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆ మహిళ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్ ఇంద్రాపుర్ ప్రాంతానికి చెందిన సుష్మా అనే మహిళ రీల్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రహదారి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డులో రీల్స్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె కెమెరా వైపు నడుచుకుంటూ వస్తోంది. అదే సమయంలో ఆమె పక్క నుంచి బైక్‌పై వచ్చిన ఓ యువకుడు.. మెడలోని గొలుసు లాక్కొని పరారయ్యాడు. ఈ హఠాత్పరిణామానికి భిత్తరపోయిన ఆమె.. పెద్దగా కేకలు వేసింది. కానీ, అప్పటికే అతడు అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయాడు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రీల్స్ మోజులో పడి విలువైన వస్తువు పోగొట్టుకుంది’, ‘దొంగ గొలుసు లాక్కెళుతుంటే ప్రతిఘటించేందుకు ప్రయత్నించలేదు’ అని కామెంట్లు పెడుతున్నారు. ‘ఆమె రీల్స్ చేయకుంటే ఈ ఘటన జరిగుండేది కాదు.. దేశంలో ఇటువంటివి తరుచూ జరుగుతున్నాయి.. ఆమె రీల్‌ను చేస్తున్నప్పుడు అనుకోకుండా సంఘటనను క్యాప్చర్ చేసింది కాబట్టి రీల్ చేయడం దీనికి కారణం కాదు. ఇలా ఎక్కడైనా జరగవచ్చు’ అని మరో వ్యక్తి కామెంట్ పెట్టారు. ఈ ఘటనపై ఇంద్రపూర్ ఏసీపీ స్వతంత్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు మార్చి 24న చైన్ స్నాచింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. కేసు నమోదు చేయబడింది.. విచారణ జరుగుతోంది’ అని అన్నారు.