నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుకు బీజేపీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తామే అవకాశమివ్వాలని టీడీపీ నాయకత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. పశ్చిమ గోదావరిలో ఏదైనా అసెంబ్లీ స్థానంలో బరిలో దించాలని భావిస్తోంది. వాస్తవానికి ఆయనకు నరసాపురం లోక్‌సభ స్థానంలోనే బీజేపీ అభ్యర్థిగా అవకాశం లభిస్తుందని టీడీపీ వర్గాలు అనుకున్నాయి. ఆ దిశగా ముందుగానే సంకేతాలు వచ్చాయని తెలిపాయి. కానీ చివరకు ఆ పార్టీ శ్రీనివాస వర్మ అనే మరో నేతకు అవకాశం కల్పించింది. రఘురామరాజుకు సీటు దక్కకపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో తామే టీడీపీ తరఫున టికెట్ ఇవ్వడంపై టీడీపీ నాయకులు దృష్టి సారించారు. తొలుత విజయనగరం లోక్‌సభ స్థానంలో పోటీచేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. కొందరు నేతలు ప్రతిపాదించగా.. ఉత్తరాంధ్ర నాయకులు అంగీకరించలేదు. తమ ప్రాంత సామాజిక సమీకరణల రీత్యా ఈ యోచన ఉపయుక్తం కాదని.. పార్టీకి ఇబ్బంది అవుతుందని అన్నట్లు తెలిసింది. చివరకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సీట్లో ఆయనను నిలపాలన్న ప్రతిపాదన వచ్చింది. ఆ జిల్లాలో తమ కోటా కింద వచ్చిన అన్ని అసెంబ్లీ సీట్లకు టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. వారిలో ఎవరినైనా ఆపి రఘురామ రాజును నిలిపితే ఎలా ఉంటుందన్నదానిపై సమాచారం సేకరిస్తున్నారు.