డీఎస్సీకి ముందు నిర్వహించిన టెట్ ఫలితాలనే సకాలంలో విడుదల చేయలేకపోయిన ప్రభుత్వం డీఎస్సీని నిర్వహించడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెట్ ఫలితాలకే ఈసీ అనుమతి కోరిన ప్రభుత్వం, ఇక డీఎస్సీని ఎలా నిర్వహించగలదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా, అందులో న్యాయ వివాదాలు ఏర్పడే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ఎస్జీటీ పోస్టులకు అర్హత, టెట్.. డీఎస్సీకి మధ్య విరామం లేకుండా షెడ్యూలు లాంటి నిర్ణయాలను న్యాయస్థానం తప్పుబట్టింది. పాఠశాల విద్యాశాఖ కావాలనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని అభ్యర్థులు అంటున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అర్హతల విషయంలో అన్నిసార్లు మార్పులు చేసి, ఆ వ్యవహారం కోర్టుకు వెళ్లేలా చేయదనేది అభ్యర్థుల వాదన. ఎన్నికల సమయంలో ఏవైనా పోటీ పరీక్షలుంటే, ఇతర బోర్డులు వాటినే వాయిదా వేస్తున్నాయి. కానీ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే ఏకంగా నెల రోజుల పాటు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.