టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 27వ తేదీ బుధవారం నుంచీ ప్రజాగళం పర్యటన చేపట్టనున్నారు. రోజూ మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుని.. వారి గళాన్ని రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్యఉద్దేశం.బుధవారం ఉదయం 9.30గంటలకు పలమనేరు నుంచీ ప్రజాగళం పర్యటన మొదలు పెట్టనున్నారు. తొలిరోజు పలమనేరుతో పాటు పుత్తూరు, మదనపల్లెల్లో కూడా పర్యటించనున్నారు. బుధవారం కుప్పం నుంచీ పలమనేరు చేరుకుని ఉదయం ప్రజాగళం తొలి బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడ నుంచీ రోడ్డుమార్గాన పుత్తూరు పట్టణం చేరుకుని మధ్యాహ్నం 3 గంటలకు రోడ్‌షో అనంతరం బహిరంగసభల్లో పాల్గొంటారు. అనంతరం పుత్తూరు నుంచీ హెలికాప్టర్‌లో మదనపల్లె చేరుకుని రాత్రి 7 గంటలకు జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.ప్రజాగళం బహిరంగసభ విజయవంతానికి నగరి టీడీపీ ఇంఛార్జి గాలి భానుప్రకా్‌షతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలైన జీడీనెల్లూరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఇంఛార్జులు, అభ్యర్థులు డాక్టర్ థామస్, పులివర్తి నానీ, బొజ్జల సుధీర్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం కృషి చేస్తున్నారు. భారీ జనసమీకరణపై వీరంతా దృష్టి పెట్టారు. ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక జిల్లాలో అధినేత పాల్గొంటున్న తొలి బహిరంగసభ కావడంతో దీన్ని పార్టీ నేతలు, శ్రేణులు ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నాయి. దీంతో తొలి బహిరంగసభను నభూతో అన్న రీతిలో నిర్వహించేందుకు పార్టీ నేతలు శ్రమిస్తున్నారు.