బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు గాంచిన కంగనా రనౌత్.. రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. బీజేపీ తరఫున రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగనున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో కంగనా రనౌత్‌కు అవకాశం కల్పించారు. గత కొన్నేళ్లుగా బీజేపీకి.. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి పూర్తి మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు, పోస్ట్‌లు చేస్తున్న కంగనా.. తాజాగా బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. అయితే బాలీవుడ్‌లోనూ తన నటన, పాత్రలతో విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకున్న కంగనా.. ఏకంగా 15 నేషనల్ అవార్డ్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే అసలు ఆమె ఎక్కడి నుంచి వచ్చారు. ఎలా ఎదిగారు. సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా అయ్యేందుకు ఎలాంటి కష్టాలు పడ్డారో చూద్దాం.
చాలా కాలంగా బీజేపీకి అనుకూలంగా కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె త్వరలోనే కమలం పార్టీలో చేరవచ్చనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఆమెకు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వడంతో వాటికి తెరపడి ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ నేపథ్యంలోనే తనకు ఎంపీ టికెట్ ఇవ్వడంపై కంగనా స్పందించారు. తనపై నమ్మకం ఉంచి పోటీ చేసేందుకు అవకాశమిచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తన సొంత ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే అంత కన్నా సంతోషం ఇంకేమీ ఉండదని వెల్లడించారు. తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని.. ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
ఎన్నో అవార్డులు
ప్రధానంగా హిందీ సినిమాల్లోనే నటించిన కంగనా.. ఆ తర్వాత తమిళ చిత్రాలు కూడా చేశారు. తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా 2021 లో తీసిన తలైవి సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత 2023 లో చంద్రముఖి 2 సినిమాలో కూడా కంగనా నటించారు. ఈ క్రమంలోనే కంగనకు 4 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, 5 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, 3 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు లభించాయి. ఇవే కాకుండా స్క్రీన్, జీ సినీ, సైమా, ప్రొడ్యూసర్ గిల్డ్‌ల నుంచి ఒక్కో అవార్డు కంగనను వరించాయి.
కంగనకు పద్మ శ్రీ
2021 లో నాలుగో నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌ను అందుకున్న తర్వాత తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. పంగా, మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రాలకు గాను కంగనా రనౌత్‌ను ఉత్తమ నటి అవార్డు వరించింది. ఇక 2020 ఏడాదికి గాను కంగనా రనౌత్ పద్మ శ్రీ అవార్డును దక్కించుకున్నారు. 2021 లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మా అవార్డుల ప్రదానోత్సవంలో అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా కంగనా పద్మ శ్రీ అందుకున్నారు.
ఎమర్జెన్సీ సినిమా విడుదలకు సిద్ధం
ఇక ప్రస్తుతం కంగనా రనౌత్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా ఎమర్జెన్సీని విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ ఎమర్జెన్సీ చిత్రాన్ని రూపొందించారు. ఈ ఏడాది జనవరి 22 వ తేదీన అయోధ్యలో జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరైన కంగనా.. ఆ తర్వాతి రోజు ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ డేట్‌ను వెలువరించారు. జూన్ 14 వ తేదీన ఎమర్జెన్సీ సినిమాను విడుదల చేయనున్నట్లు కంగనా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa