ఒకరి తర్వాత ఒకరు ఇలా ఎనిమిది ఆడపిల్లలు పుట్టడంతో అందరూ అమ్మాయిలేనా? అని బంధువులు హేళన చేశారు. సూటిపోటి మాటలతో వేధించినా.. ఆ తల్లిదండ్రులు మాత్రం ధైర్యం కోల్పోలేదు. ఇరుగుపొరుగువారి ఈసడింపులతో వేదనకు గురై తన సొంతూరును వదిలిపెట్టి.. వేరే ప్రాంతానికి వెళ్లి స్థిరపడ్డాడు. తన కుమార్తెల సాయంతో కుటుంబం పోషణ చేస్తూ.. వారిని చదివించి ప్రయోజకులను చేశాడు. ఆడపిల్లలు అని చులకనగా మాట్లాడిన వాళ్ల నోళ్లు మూయించాడు. తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగిన అమ్మాయిలు.. ఆయన పేరును నిలబెట్టారు. ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసు శాఖతో పాటు వివిధ భద్రతా విభాగాల్లో ఉద్యోగాలు సంపాదించారు. దీంతో సెవెన్ సిస్టర్స్‌తో పాటు వారిని ఈ స్థాయికి తీసుకువచ్చిన తండ్రి పేరు ప్రస్తుతం మారుమోగుతోంది.
వివరాల్లోకి వెళ్తే బిహార్లోని ఛప్రా జిల్లాకు చెందిన కమల్ సింగ్కు 8 మంది కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిలో ఒక కుమార్తె అనారోగ్య కారణంతో చిన్నప్పుడే మృతి చెందింది. దీంతో మిగతావారిని ఎంతో కష్టపడి చదవించాడు. ఒకరి తర్వాత ఒకరు ఆడపిల్లలే పుట్టడంతో సమాజం ఆయన్ను చిన్నచూపు చూసింది. ఒకానొక సమయంలో తన పూర్వీకుల సొంత గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. దీంతో కమల్ సింగ్ సరన్ జిల్లాలోని నాచాప్ గ్రామంలోని తన ఇంటిని ఖాళీ చేసి.. భార్యా పిల్లలతో చప్రాలోని ఎక్మాకు వచ్చేశాడు.
అక్కడ వ్యవసాయం చేసుకుంటూనే తన కూమార్తెల సాయంతో ఇంటి వద్ద ఓ చిన్న పిండి మిల్లు నడిపేవారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే ఏడుగురు ఆడపిల్లలను చదివించారు. ఆ సమయంలో తినడానికి కూడా తిండి ఉండేది కాదు. కానీ, తన కుమార్తెలను ఉన్నత స్థితిలో చూడాలని కలగన్నారు. తండ్రి కష్టాన్ని గ్రహించిన పిల్లలు కూడా అంతే పట్టుదలతో చదివారు. మొదటి కుమార్తె 2006లో శస్త్ర సీమ బల్ (ఎస్ఎస్‌బీ) కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యింది. ఆమె మిగతా ఆరుగురికి మార్గదర్శిగా నిలిచింది. రెండో అమ్మాయి రాణి వివాహమైన తర్వాత 2009లో బిహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. ఆ తర్వాత మిగతా ఐదుగురు పోలీస్, పారా మిలటరీ దళాల్లో ఉద్యోగాలను పొందారు.
ప్రభుత్వ స్కూల్‌లో చదువుతూ పొలాల్లోనే పరుగెత్తుతూ డిఫెన్స్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యారు. ఒకరి తర్వాత ఒకరు ఏడుగురూ ఉద్యోగాలు పొందడంతో ఆ తండ్రి ఆనందానికి హద్దుల్లేవు. కమల్ సింగ్ మాట్లాడుతూ.. ‘కూతుళ్లను వదులుకోవాలని సమాజం సూచించింది.. అయితే తండ్రిగా వారి మాటలను పట్టించుకోలేదు.. మొండి పట్టుదలతో నా కుమార్తెలు ఓటమిని అంగీకరించలేదు.. ఎట్టకేలకు అందరూ తమ కఠోర శ్రమ, అంకితభావంతో ఆ స్థానాన్ని సాధించి, ఆడబిడ్డలు శాపం కాదని, వరం అని సమాజ ప్రజలకు చాటిచెప్పారు’ అని హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఎస్బీ, జీఆర్పీ, బిహార్ పోలీస్, సీఆర్పీఎఫ్, ఎక్సైజ్ శాఖలో వేర్వేరు స్థానాల్లో ఉన్నారు.
సమాజం హేళన చేస్తున్నా పట్టించుకోకుండా తమపై నమ్మకం పెట్టుకున్న ఆ తండ్రికి.. ఏడుగురు కుమార్తెలు చిరు కానుకగా నాలుగు అంతస్తులు భవనం కట్టించి ఇచ్చారు. ఈ భవనంలో ఒక అంతస్తులో కమల్ సింగ్ కుటుంబం ఉంటోంది. మిగతావి అద్దెకు ఇచ్చానని, నెలకు రూ.20 వేల వరకూ వస్తోందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa