తెనాలిలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. ఉద్యోగాలు అడిగితే గంజాయి ఇస్తున్నారన్నారు. టీడీపీ హాయాంలో పట్టిసీమ పూర్తి చేయడంతో ఈ ప్రాంతానికి సాగు నీరు అందుతోందన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం 50 ఏళ్ళు వెనక్కు పోయిందని పెమ్మసాని విమర్శించారు. మరోసారి తప్పు జరిగితే ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరన్నారు. వైసీపీ దౌర్జన్యాలను ఖండించడానికి తాను ఒక పోలిక చేశానని పెమ్మసాని అన్నారు. దానిపై ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతిన్నాయని దీనికి తాను క్షమాపణ చెప్పానన్నారు. తనపై విమర్శలు చేసే ముందు వైసీపీ నేతలు ముస్లిం మైనార్టీ మహిళను చెప్పుతో కొట్టారని... అర్చకులపై దాడి చేశారని వాటిన్నింటినీ ఖండించాలన్నారు. సీఎం జగన్ కాపాడుతారనే భావనతో దాడులు చేస్తున్నారన్నారు. ప్రజలకు మేలు చేయటానికే రాజకీయాల్లోకి వచ్చానని.. ఎవరి మనోభావాలు దెబ్బతీయటానికి కాదని పెమ్మసాని తెలిపారు. అదే టీడీపీ ఉంటే ముస్లిం మహిళను కొట్టిన వ్యక్తిని చీల్చి చండాడేవారన్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రకృతి వనరులను పూర్తిగా దోచేస్తున్నారన్నారు. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరన్నారు.