ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో గల సీబీఐ కోర్టులో అన్నీ కేసులకు సంబంధించి 3 వేల వాయిదాలు తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ అంశానికి సంబంధించి తాను రెండు పిటిషన్లు దాఖలు చేశానని గురువారం నాడు భీమవరంలో రఘురామ వివరించారు. ఆ కేసులను వెంటనే విచారించాలని ఒకటి, ఇన్ని రోజులు కోర్టుకు వెళ్లలేనందున బెయిల్ రద్దు చేయాలని మరో పిటిషన్ వేశానని పేర్కొన్నారు. ఆ పిటిషన్లు ఏప్రిల్ 1వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్నాయని రఘురామ తెలిపారు. ఏపీ సీఎం జగన్‌పై కోర్టుల్లో తాను ఒంటరిగా పోరాడుతున్నానని రఘురామ వివరించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు వేశానని తెలిపారు. ఆయా కేసుల్లో తాను వేసిన పిటిషన్లు తప్పు అనేందుకు లేదని స్పష్టం చేశారు. వివిధ కేసుల్లో సీఎం జగన్ 3 వేల వాయిదాలు అడిగిన మాట నిజం అని రఘురామ మరోసారి స్పష్టం చేశారు. వాస్తవానికి అన్ని వాయిదాలు ఇవ్వొద్దు.. దానికి సంబంధించి నిబంధనలు కూడా ఉన్నాయని రఘురామ పేర్కొన్నారు. దానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం విచారణ కోసం ఎదురు చూస్తున్నానని వెల్లడించారు.