శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి పంచాయతీతో పాటు బోరుభద్రలో వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్టు సి-విజిల్‌కు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో గురువారం ఆరుగురు వలంటీర్లను విధుల నుంచి తొలగించినట్టు ఎంపీడీవో ఉమాసుందరి తెలిపారు. టెక్కలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి.. సంతబొమ్మాళిలో వలంటీర్లు కల్లూరి పాపారావు, వాదాల దుర్గారావు, అట్టాడ కామేశ్వరరావు, బొమ్మాళి ఉమాశంకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆధారాలతో సహా గురువారం సి-విజిల్‌కు ఫిర్యాదు చేశారు. ఆధారాలను పరిశీలించిన నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి టెక్కలి సబ్‌కలెక్టర్ సబ్ కలెక్టర్ నూరుల్‌కమర్.. ఆ నలుగురు వలంటీర్లను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారని ఎంపీడీవో ఉమాసుందరి తెలిపారు. ఈ మేరకు పంచాయతీ లాగిన్ నుంచి వారిని తొలగించాలని కార్యదర్శికి ఆదేశాలు జారీచేశామన్నారు. అలాగే బోరుభద్రలో ఉపాధిహామీ పనుల వద్ద వైసీపీకి అనుకూలంగా వలంటీర్లు మల్ల అశ్విని, బొడ్డ శ్రీలత ప్రచారం చేస్తున్నారని సి-విజిల్‌కు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై విచారణ చేపట్టి ఆ ఇద్దరినీ విధుల నుంచి తొలగించామని ఎంపీడీవో తెలిపారు.