బొబ్బిలి మండలంలోని అలజంగి గ్రామంలో శుక్రవారం రాత్రి బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రక్రియ పూర్తిచేయాలని, ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎవరూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, బెదిరింపులు, ఒత్తిళ్లకు పాల్పడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. నేరాలకు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అసాంఘిక శక్తులను ప్రోత్సహించద్దన్నారు. ఎవరి ఓటును వారు సక్రమంగా వినియోగించుకునే పరి స్థితులను కల్పిస్తూ శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసు యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎస్పీ హితవు పలికారు. కార్యక్రమంలో సీఐ మలిరెడ్డి నాగేశ్వరరావు, ఎస్‌ఐ లోవరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
![]() |
![]() |