భార్యాభర్తల మధ్య సాధారణంగానే గొడవలు జరుగుతూనే ఉంటాయి. దీంతో వారు తిట్టుకోవడం, కొట్టుకోవడం, చివరికి పోలీసుల దగ్గరికీ.. ఆ తర్వాత ఫ్యామిలీ కోర్టులకు ఎక్కడం మనం చూస్తూనే ఉంటాం. ఇక వారిద్దరినీ కలిపేందుకే పోలీసులైనా, కోర్టులైనా చూస్తాయి. ఇక విధిలేని పరిస్థితుల్లో వారిద్దరు మళ్లీ కలవరు అన్నపుడు మాత్రమే ఇద్దరి పరస్పర అంగీకారంతో కోర్టులు విడాకులు మంజూరు చేస్తూ ఉంటాయి. అయితే విడాకులు తీసుకున్న జంట.. ఒకరినొకరు భూతం, పిశాచి అంటూ తిట్టుకోవడం క్రూరత్వంతో సమానం కాదని పాట్నా హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళ చేసిన ఫిర్యాదుపై కింది కోర్టు ఇచ్చిన తీర్పును.. హైకోర్టులో ఆమె భర్త సవాల్ చేయగా.. పాట్నా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
బీహార్‌లోని నవాదాకు చెందిన ఓ మహిళకు.. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన నరేశ్ గుప్తా అనే వ్యక్తితో 1993 లో పెళ్లి జరిగింది. అయితే.. వారి సంసారం మొదటి నుంచి గొడవలు, వేధింపులతోనే సాగింది. దీంతో తనను అదనపు కట్నం తీసుకురావాలని తన భర్త నరేశ్ గుప్తా, మామ సహదేవ్ గుప్తాలు వేధిస్తున్నారని.. పెళ్లయిన ఏడాదికే 1994 లో వారిద్దరిపై ఆ మహిళ కేసు పెట్టింది. అదనపు కట్నం కింద కారు కొనివ్వాలని భర్త, మామ తనను చిత్ర హింసలు పెడుతున్నారని ఆమె ఆరోపించింది.
ఈ కేసు స్థానిక కోర్టుకు వెళ్లగా నరేశ్ గుప్తా, సహదేవ్ గుప్తాల కోరిక మేరకు ఆ కేసును నలందకు బదిలీ చేశారు. మహిళ పిటిషన్‌పై విచారణ జరిపిన నలంద కోర్టు.. 2008లో తండ్రీకుమారులు ఇద్దరికీ ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. వారిద్దరు అదనపు సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అయితే పదేళ్ల తర్వాత ఆ అప్పీల్ తిరస్కరణకు గురికావడంతో.. దాన్ని మళ్లీ సవాల్ చేస్తూ పాట్నా హైకోర్టుకు వెళ్లారు. ఆలోగానే నరేశ్ గుప్తా, అతని భార్యకు జార్ఖండ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.
ఇక ఆ మహిళపై నరేశ్ గుప్తా, సహదేవ్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ.. పాట్నా హైకోర్టులో మహిళ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కాలంలో కూడా భార్యను అత్తింటి వారు భూతం, పిశాచి అంటూ తిట్టారని.. అది క్రూరత్వం కిందికే వస్తుందని లాయర్ వాదించారు. అయితే మహిళ తరఫు న్యాయవాది చేసిన వాదనను పాట్నా హైకోర్టు తప్పుపట్టింది. భార్యాభర్తలు తిట్టుకోవడంలో భాగంగా భూతం, పిశాచి అనడం క్రూరత్వం కిందికి రాదని.. జస్టిస్ బిబేక్ చౌధురి స్పష్టం చేశారు.
భార్యాభర్తల వైవాహిక జీవితంలో ఒకరినొకరు దూషించుకున్న సందర్భాలు చాలా ఉంటాయని.. అలాంటివన్నీ క్రూరత్వం కిందికి రావని న్యాయమూర్తి పేర్కొన్నారు. తనను భర్త, మామ అదనపు కట్నం కోసం క్రూరంగా హింసించారని మహిళ చెప్పినప్పటికీ.. పిటిషనర్లలో ఎవరిపైనా నిర్దిష్టమైన ఆరోపణలు చేయలేదని కోర్టు గుర్తు చేసింది. ఈ క్రమంలోనే దిగువ కోర్టులు వెలువరించిన తీర్పులను రద్దు చేస్తూ ఆ పిటిషన్లను కొట్టివేసింది.