పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడు పెంచారు. విశాఖపట్నం దక్షిణం స్థానానికి జనసేన అభ్యర్థిని ఖరారు చేశారు. ఇక్కడి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా సీహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం పార్టీ నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ పెండింగ్ స్థానాలలో అభ్యర్థుల ప్రకటనపై చర్చించారు. అనంతరం విశాఖ దక్షిణం అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా వంశీకృష్ణ పేరును ఖరారు చేశారు.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు వచ్చాయి. ఇప్పటి వరకూ 19 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్ మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డతో పాటు పాలకొండ ఎమ్మెల్యే స్థానానికి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అటు మచిలీ పట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన తరఫున బాలశౌరి పోటీ చేస్తున్నారు. కాకినాడ ఎంపీ స్థానానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించారు.
ఇక విశాఖపట్నానికి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కొద్ది నెలల కిందటే వైసీపీని వీడి జనసేనలో చేరారు. అనంతరం పవన్ కళ్యాణ్.. వంశీకృష్ణ శ్రీనివాస్‌ను విశాఖపట్నం జనసేన అధ్యక్షులుగా నియమించారు. ప్రస్తుతం విశాఖ సౌత్ స్థానానికి జనసేన అభ్యర్ధిగా ప్రకటించారు. వంశీకృష్ణను అభ్యర్థిగా ప్రకటిస్తారని గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎట్టకేలకు ఆదివారం ఖరారు చేశారు.