అగ్రరాజ్య అధినేత జో బైడెన్ అంటేనే చుట్టూ భారీగా సెక్యూరిటీ ఉంటుంది. ప్రపంచంలోనే హై సెక్యూరిటీ మధ్య ఉండే బైడెన్ చుట్టూ దొంగతనాలు కావడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో సామాన్లు దొంగతనానికి గురి కావడం సంచలనంగా మారింది. ఈ ఎయిర్‌ఫోర్స్ విమానాన్ని ఎగిరే వైట్‌హౌస్‍గా పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ విమానంగా పరిగణించే ఎయిర్‌ఫోర్స్ వన్‌లో గత కొన్ని సంవత్సరాలుగా చోరీలు జరగడం కలకలం రేపుతోంది. ఈ విషయం సెక్యూరిటీ సిబ్బంది దృష్టికి రావడంతో నిఘా పెట్టి ఎట్టకేలకు ఆ దొంగలు ఎవరో గుర్తించారు. అది చూసి అంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ సామాన్లు ఎత్తుకెళ్లింది దొంగలు కాదు.. అధ్యక్షుడి వెంట ప్రయాణించే మీడియా ప్రతినిధులే. అది తెలుసుకున్న అమెరికా అధ్యక్ష సిబ్బంది.. సదరు జర్నలిస్ట్‌లకు వార్నింగ్ ఇచ్చారు.
అయితే దొంగతనానికి గురైన కొన్ని వస్తువులను వారి నుంచి సెక్యూరిటీ సిబ్బంది తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో జరిగిన ఈ దొంగతనాల విషయాన్ని ఆంగ్లపత్రిక పొలిటికో బయటపెట్టింది. అమెరికా అధ్యక్షుడు చేసే అధికారిక పర్యటనలకు కొన్ని మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులను ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో జో బైడెన్ తీసుకువెళ్తారు. అయితే ఆ సమయంలో ఆ జర్నలిస్ట్‌లు విమానంలోని విస్కీ, వైన్ గ్లాస్‌లు, బంగారు పూత పూసిన పింగాణీ పాత్రలు, పిల్లో కవర్స్ సహా ఎన్నో వస్తువులను గత కొన్నేళ్లుగా ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించారు. విమానంలోని వస్తువులను తమ బ్యాగుల్లో సర్దుకుని.. సైలెంట్‌గా వారి పని కానిచ్చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో చోరీల గురించి ది వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేల్లీ ఓడేనియల్ ఇటీవలే పేర్కొన్నారు. ఇక ముందు నుంచి అయినా జర్నలిస్ట్‌లు అలాంటి దొంగతనాలు ఆపాలని సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే అమెరికా అధ్యక్షుడితో ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించామనే గుర్తు కోసం అందులోని వస్తువులను మీడియా సిబ్బంది ఎత్తుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై స్పందించిన కెల్లీ ఒడేననియల్.. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రయాణించారని ప్రజలు నమ్మాలంటే అందులోని వస్తువులు తీసుకెళ్లాల్సిన పని లేదని.. ఆ విమానంలో దిగిన ఫోటోలను అందరికీ పంపిస్తామని పేర్కొన్నారు.
గతంలో ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మీడియా ప్రతినిధునలకు డిన్నర్ ఏర్పాటు చేశారు. అందులో బంగారంతో పూత పూసిన పింగాణీ ప్లేట్లను ఉంచగా.. డిన్నర్ తర్వాత ఆండ్రూస్ జాయింట్ ఎయిర్ బేస్‌లో విమానం ఆగిన తర్వాత కొందరు జర్నలిస్ట్‌ల బ్యాగుల నుంచి ప్లేట్ల సౌండ్ వినిపించినట్లు స్వయంగా ఓ జర్నలిస్టే వెల్లడించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 5 వ తేదీన శ్వేతసౌధం ట్రావెల్ ఆఫీస్.. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో సామన్లు కనిపించడం లేదని గుర్తించింది. ఎవరైనా పొరపాటున విమానంలోని వస్తువులు తీసుకెళ్లిపోతే వాటిని తిరిగి ఇచ్చేయాలని మీడియా ప్రతినిధులకు ఈ-మెయిల్ చేశారు. దీంతో ఒక జర్నలిస్ట్ పిల్లోకేస్‌ను సైలెంట్‌గా తీసుకెళ్లి పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలోని ఆండ్రూ జాక్సన్ విగ్రహం వద్ద సిబ్బందికి అప్పగించారు.