భీమిలి రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ నుంచి గురుశిష్యులుగా పేరొందిన గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు రెండు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తుంటే, వైసీపీ నుంచి అవంతి బరిలో ఉన్నారు. గంటా శ్రీనివాసరావును ఊరించి, ఊరించి ఆఖరి జాబితాలో టికెట్ ఇచ్చారు చంద్రబాబు. మంత్రి బొత్స సత్యనారాయణ మీద గంటాను పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు. కానీ అందుకు గంటా శ్రీనివాసరావు ఆసక్తి చూపకపోవటంతో చివరకు ఆఖరి జాబితాలో భీమిలి టికెట్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు లక్ష్యంగా అవంతి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గంటా శ్రీనివాసరావుకు భీమిలి సీటును ముష్టి వేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గంటా శ్రీనివాసరావు చంద్రబాబు కాళ్లు పట్టుకుంటే టికెట్ ఇచ్చారంటూ విమర్శలు చేశారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి నియోజవర్గాలు మార్చే గంటా శ్రీనివాసరావుకు పగలు ఎక్కటుంటాడో రాత్రి ఎక్కడ తిరుగుతాడో తెలియదంటూ అవంతి సెటైర్లు పేల్చారు. వైసీపీ నేతల జోలికి, కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేదీ లేదంటూ హెచ్చరించారు.
ఈ క్రమంలోనే టీడీపీ పార్టీపైనా అవంతి శ్రీనివాసరావు విమర్శలు చేశారు. పేద ప్రజలకు పథకాలు అందకుండా చంద్రబాబు చవకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వృద్ధులకు సంబందించిన పింఛన్లు వాలంటీర్లు ద్వారా ఇవ్వడంపై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకోవడం సరికాదని విమర్శించారు. పేదలపై చంద్రబాబుకు ఎందుకింత పగ అని ప్రశ్నించారు. వృద్ధులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వాలంటీర్ల ద్వారా పింఛన్లు అందిస్తున్నట్లు అవంతి చెప్పుకొచ్చారు. దీన్ని కూడా రాజకీయ కోణంలో అధికార పార్టీకి లబ్ధి చేకూరుతుందని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి పంపిణీ కార్యక్రమం అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు.
మరోవైపు మరో మూడు నెలలపాటు వృద్ధులకు ఈ యాతన తప్పదని అవంతి చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైయస్ జగన్ కృషి చేస్తున్నారన్న అవంతి శ్రీనివాసరావు.. విశాఖపట్నాన్ని రాజధాని ప్రకటిస్తే దానిని అడ్డుకోవడం దారుణమైన విషయమని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి తెలుగు దేశం పార్టీ నాయకులకు ఇష్టంలేదన్న అవంతి.. ఏ ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక వైసీపీ నుంచి ఎంతమంది నేతలు పోయినా వచ్చే నష్టమేమీ లేదని అవంతి అభిప్రాయపడ్డారు.