ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీలో చేరకపోతే నాతోపాటు నలుగురు ఆప్ నేతలను అరెస్ట్ చేస్తారు: ఢిల్లీ మంత్రి అతిషి

national |  Suryaa Desk  | Published : Tue, Apr 02, 2024, 11:14 PM

ఢిల్లీ మద్యం కేసు ధాటికి ఆమ్ ఆద్మీ పార్టీ కకావికలం అవుతోంది. ఇప్పటికే ఢిల్లీ కేబినెట్‌లో ఇద్దరు మంత్రులు, ఒక రాజ్యసభ ఎంపీ అరెస్ట్ అయి జైలులో ఉండగా.. ఇటీవలె ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్లడం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ క్రమంలోనే అటు ఢిల్లీ పాలన, ఇటు ఎన్నికల వేళ ఆప్ ప్రచారంపై తీవ్ర ప్రభావం పడింది. వీరినే కాకుండా ఇటీవలె మరో ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లోత్‌కు ఈడీ సమన్లు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరయ్యారు. మరోవైపు.. తమ విచారణలో కేజ్రీవాల్.. మరో ఇద్దరు ఢిల్లీ మంత్రుల పేర్లు చెప్పారని ఈడీ తాజాగా కోర్టుకు తెలిపింది. ఢిల్లీ మంత్రులు అతిషి మార్లేనా, సౌరభ్ భరద్వాజ్‌లకు విజయ్ నాయర్ రిపోర్ట్ చేసేవాడని కేజ్రీవాల్ చెప్పినట్లు ఈడీ అధికారులు.. విచారణ సందర్భంగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు వెల్లడించారు.


ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ మంత్రి అతిషి మార్లేనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో మరికొంతమంది ఆప్ నేతలను కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. తనతోపాటు మరో ముగ్గురు ఆప్ నేతలను ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరాలని తమను ఒత్తిడి చేస్తున్నారని.. ఒక వేళ చేరకపోతే తనను, మరో ఢిల్లీ సౌరభ్ భరద్వాజ్, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, దుర్గేష్ పాఠక్‌లను ఈడీ అధికారులు త్వరలోనే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అతిషి మార్లేనా సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఈ క్రమంలోనే తమ పార్టీ నేతలను బీజేపీ టార్గెట్ చేసిందని ఆరోపించిన అతిషి.. తమ ఇళ్లలో త్వరలోనే ఈడీ అధికారులు సోదాలు చేస్తారని.. ఆ తర్వాత తమ నలుగురిని అదుపులోకి తీసుకుంటారని చెప్పారు. సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ఆప్ పడిపోతుందని బీజేపీ ఊహించిందని.. కానీ ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో జరిగిన భారీ ర్యాలీతో ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలన్నీ ఒక్కటి అవడాన్ని చూసి బీజేపీ భయపడుతోందని పేర్కొన్నారు. త్వరలోనే తమకు సమన్లుజారీ చేసి.. ఆ తర్వాత జైలులో పెడతారని చెప్పారు. అయినప్పటికీ తాము బీజేపీకి భయపడటం లేదని.. చివరి శ్వాస వరకు కేజ్రీవాల్‌తోనే పోరాడతామని. అందరినీ జైలులో పెట్టినా.. అక్కడి నుంచే ఉద్యమాన్ని కొనసాగిస్తామని అతిషి స్పష్టం చేశారు. ఇక బీజేపీలో చేరాలని తనను కొందరు సంప్రదించారని అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరితే రాజకీయ జీవితాన్ని కాపాడుకోవచ్చని పలువురు ఆఫర్ చేశారని చెప్పారు. ఇప్పటికే సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్‌లను జైలులో వేసిన బీజేపీ త్వరలోనే మిగతా ఆప్ నేతలపై చర్యలు తీసుకుంటుందని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com