ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గతేడాది అక్టోబరులో సంజయ్ సింగ్ అరెస్టయ్యారు. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ఎటువంటి షరతులు విధించలేదు. సంజయ్ సింగ్ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కూడా అనుమతించింది. మరో మూడు వారాల్లో లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ జరగునుంది. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఒక్క పైసా కూడా లభించనప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారని.. ఎందుకు జైల్లో పెట్టారని ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై అక్టోబరులో సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోరాతో సంజయ్‌కు పరిచయాలు ఉన్నట్టు గుర్తించిన ఈడీ.. ఆయనను అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన సంజయ్ సింగ్.. జనవరిలో జైలు నుంచి నేరుగా రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేశారు. వ్యక్తిగతంగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఎన్నికలకు సంబంధించి అండర్‌టేకింగ్‌లు, నామినేషన్ ఫారాలు, ఇతర ఆధారాలపై సంతకం చేయడానికి అనుమతించాలని జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. జనవరి 27తో ఆయన పదవీకాలం ముగియగా.. ఆప్ ఆయనను రెండోసారి రాజ్యసభకు నామినేట్ చేసింది.
ఎక్సైజ్ డ్యూటీ పాలసీని రూపొందించడం, అమలు చేయడంలో సంజయ్ సింగ్ కీలక పాత్ర పోషించారనేది ఈడీ ఆరోపణ సంజయ్ సింగ్ కంటే ముందు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్, ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసి జైలుకు పంపింది. గత నెలలో ఈడీ అదుపులోకి తీసుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. సోమవారం ఆయనకు రౌస్ ఎవెన్యూ కోర్టు మరో రెండు వారాల పాటు కస్టడీని పొడిగించింది.