ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్ట్‌ల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా కర్చోలి అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వర్గాలను టార్గెట్ చేసుకుని నక్సల్స్ చర్యలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు ముందుగానే గ్రహించాయి. దీంతో దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతకు పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా జెల్లెడ పడుతున్నాయి. వారం రోజుల్లోనే సుమారు 20 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు.
బీజాపూర్ ఎస్పీ వి. వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగలూరు అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులు.. కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. ఈ దాడిని తిప్పికొట్టిన దళాలు.. ఎదురు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మావోయిస్టు మృతి చెందినట్టు పేర్కొన్నారు. వారిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఘటనా స్థలంలో అత్యాధునిక ఆయుధాలు, పేలు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతోందని ఎస్పీ అన్నారు.
ఇక, బిజాపూర్ జిల్లాలోని పార్లమెంట్ స్థానాలకు తొలి దశలో ఏప్రిల్ 19 పోలింగ్ జరగనుంది. దండకారణ్యంలోని బీజాపూర్ ప్రాంతం మావోయిస్ట్‌లకు కంచుకోట. అక్కడి పరిస్థితులు మావోలకు పెట్టని కోటగా మారాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భద్రతా బలగాలతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. నక్సల్స్ ఏరివేత కోసం ఆ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఇక, ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ దాదాపు 30 మంది మావోయిస్ట్‌లు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మృతిచెందారు.