ప్రయాణికులకు విమానయాన భద్రతా విభాగం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) శుభవార్త చెప్పింది. ఒకవేళ విమానం ఎక్కిన తర్వాత బయలుదేరడంలో తీవ్ర జాప్యం జరిగితే ఎయిర్‌పోర్ట్ డిపార్చర్ గేట్ నుంచి ప్రయాణికులు నిష్క్రమించవచ్చని పేర్కొంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను బీసీఏఎస్ విడుదల చేసింది. రద్దీ, జాప్యం కారణంగా విమానం ఎక్కిన తర్వాత ప్రయాణికులు గంటల కొద్దీ లోపలి కూర్చున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో తాజా నిబంధనలు వెల్లడించింది.
మార్చి 30న ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లకు మార్గదర్శకాలు జారీ చేశామని, ఇప్పుడు అమల్లోకి వచ్చాయని బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ సోమవారం తెలిపారు. ఈ మార్గదర్శకాల వల్ల ప్రయాణీకులకు వేధింపులు, ఇబ్బందులు తగ్గుతాయని, వారు ఎక్కిన తర్వాత ఎక్కువ గంటలు విమానం లోపల కూర్చోవాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు.
విమానం ఎక్కిన తర్వాత ఎక్కువ సమయం ఆలస్యమైనా లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సంబంధిత విమానాశ్రయం ఎగ్జిట్ గేటు నుంచి నిష్క్రమించడానికి అనుమతిస్తాయని ఆయన పేర్కొన్నారు. ‘విమానాశ్రయ నిర్వాహకులు మార్గదర్శకాలను అమలు చేయడం కోసం స్క్రీనింగ్‌తో సహా మౌలిక సదుపాయాల కోసం ఏర్పాట్లు చేయాలి’ అని హసన్ స్పష్టం చేశారు. ప్రయాణీకులను విమానం నుంచి దింపే విషయంలో సంబంధిత విమానయాన సంస్థలు, భద్రతా ఏజెన్సీలు నిర్ణయం తీసుకుంటాయని ఆయన వివరించారు. బీసీఏఎస్ 38వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జుల్ఫికర్ హసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త మార్గదర్శకాల గురించి తెలియజేశారు. జనవరి 17న ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై ప్రయాణికులు ఆహారం తీసుకున్న ఘటనపై ఇండిగో, ముంబై ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ MIALకు BCAS మొత్తం రూ.1.80 కోట్ల జరిమానా విధించింది. ఇండిగో రూ. 1.20 కోట్లు, MIALరూ. 60 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ప్రయాణికులు విమానం పక్కన రన్‌వేపై కూర్చుని భోజనం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.
గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. అప్పటికే చాలా ఆలస్యం కావడంతో కొందరు ప్రయాణికులు కిందకి దిగి రన్‌వేపై కూర్చొని భోజనం చేశారు. జనవరి 14న ఈ ఘటన చోటుచేసుకుంది. దేశీయ విమానాల రద్దీ పెరుగుతోంది. రోజూ దాదాపు 3,500 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. విమానాశ్రయాలలో రద్దీ సమస్యను పరిష్కరించడానికి తప్పనసరిగా పాటించాల్సి ప్రమాణాలు, నిబంధనలను తీసుకొచ్చినట్టు హసన్ చెప్పారు. ప్రయాణీకులకు మెరుగైన అనుభవాన్ని అందించే ప్రయత్నాల్లో భాగంగా ఏవియేషన్ సెక్యూరిటీ వాచ్‌డాగ్ స్మార్ట్ సెక్యూరిటీ లేన్‌లను కూడా ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం బాడీ స్కానింగ్ వ్యవస్థ ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని హసన్ అన్నారు.