తన కాళ్లు పట్టుకోమంటే నిరాకరించాడని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్ధిని విచక్షణారహితంగా కొట్టి కులం పేరుతో దూషించాడు. ఉపాధ్యాయుడి దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించారు. మార్చి 27న ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఉర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని మురార్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత విద్యార్ధి తండ్రి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు కొట్టడంతో తన కుమారుడు మనీశ్‌కు కంటి భాగంలో తీవ్రమైన గాయమైందని, వీపుపై దెబ్బలు తగిలాయని తండ్రి అకల్‌జీత్ ఫిర్యాదు చేశాడు.
దీంతో మురార్‌పుర్ ప్రాథమిక పాఠశాల గణిత ఉపాధ్యాయుడు రవిశంకర్ పాండేపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ... మార్చి 27న పాఠశాలలో తన పాదాలను తాకాల్సిందిగా ఆరో తరగతి విద్యార్ధి మనీశ్‌ను టీచర్ రవిశంకర్ పాండే కోరాడని, అందుకు బాలుడు నిరాకరించినట్టు తెలిపారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు విద్యార్థిని ఇష్టమొచ్చినట్టు బెత్తంతో కొట్టాడని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా కులం పేరుతో దూషించాడని వివరించారు. గాయాలతో విలవిల్లాడుతూ చిన్నారి ఏడుస్తుంటే పాఠశాల నుంచి గెంటేస్తానని కూడా బెదిరించినట్లు వెల్లడించారు.
బాలుడి తండ్రి అకల్‌జీత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశామని, పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారని గోరఖ్‌పూర్ ఎస్పీ జితేంద్రకుమార్ తెలిపారు. కేసు తన దృష్టికి వచ్చిందని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని ప్రాథమిక శిక్షా అధికారి (బీఎస్‌ఏ) రామేంద్ర కుమార్ చెప్పారు. అటు, ఉపాధ్యాయుడి దెబ్బలతో తన కుమారుడి కంటికి తీవ్రగాయాలైనట్టు అకల్‌జీత్ ఆరోపించారు.