మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు తిహార్ జైల్లో ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జైల్లోని కొందరు ఖైదీలు పాపులర్ అయ్యేందుకు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుతం కేజ్రీవాల్ ఉన్న రెండో నెంబరు జైల్లో గతంలో హత్యలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. 2021లో శ్రీకాంత్ రామస్వామి అనే ఖైదీని గ్యాంగ్ వార్‌లో హత్యచేశారు. ఢిల్లీలోని వసంత్ విహార్ వద్ద 2015లో జరిగిన ఓ హత్య కేసులో రామస్వామిని అరెస్టు చేసి.. తీహార్ జైల్లో పెట్టారు. నలుగురు విచారణ ఖైదీలు అతడిని క్రికెట్ బ్యాట్లతో తీవ్రంగా కొట్టినట్లు జైలు అధికారులు కోర్టుకు నివేదించారు.
అప్పట్లో ఆ కేసుకు సంబంధించి నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కూడా జైల్లో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో 33 మొబైల్ ఫోన్లు ఖైదీలు వద్ద బయటపడటంతో అధికారులు విస్తుపోయారు. ఇప్పటికే ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి కేజ్రీవాల్‌కు బెదిరింపులు వచ్చాయి. తిహార్ జైల్లోని ఖలిస్థానీలు దాడి చేస్తారని హెచ్చరిస్తూ ఈ మేరకు ఇటీవల వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
రాత్రిపూట బ్యారక్‌లో కేజ్రీవాల్ కొంచెం అసౌకర్యంగా ఉన్నారని జైలు అధికారులు పేర్కొన్నప్పటికీ ఆయన తన సాధారణ దినచర్యకు కట్టుబడి ఉన్నారు. కోర్టు ఆదేశాలతో ఔషధాలు, ఇంటి నుంచి ఆహారానికి అనుమతిస్తున్నారు. యోగా చేయడానికి ఉదయం త్వరగా మేల్కొని.. బ్రెడ్, టీతో కూడిన జైలు అల్పాహారం తీసుకుంటున్నారు. ఎక్కువగా సెల్‌లో తిరుగుతుండటం లేదా పుస్తకం చదువుతూ కనిపించారు. కేజ్రీవాల్‌ను తన సతీమణి సునీతతో వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) ద్వారా మాట్లాడేందుకు మంగళవారం అనుమతించారు. తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు తన లాయర్‌తో ఆయన కొద్ది నిమిషాలపాటు భేటీ అయ్యారు. కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు.
మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసినప్పటి నుంచి కేజ్రీవాల్ దాదాపు 4.5 కిలోల బరువు తగ్గారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ 50 కంటే దిగువకు పడిపోవడంతో చికిత్స చేసి వాటిని సాధారణ స్థాయికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని జైలు డాక్టర్లు వెల్లడించారు. ఏదైనా అత్యవసరమైతే తక్షణమే స్పందించేందుకు కేజ్రీవాల్ గదికి అత్యంత సమీపంలోనే క్విక్‌రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో సోమవారం ఢిల్లీ సీఎంను తిహార్ జైలుకు తరలించారు. అక్కడ కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.