లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుంటడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రజాకర్షక హామీలతో రాజకీయ పార్టీలు ఓటర్లు ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో అధికార, విపక్షాలు పోటీపడుతున్నాయి. ఇక, తమిళనాడులోని మొత్తం 39 సీట్లకు ఏప్రిల్ 19న తొలి విడతలో పోలింగ్ జరగనుండటంతో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీలు విజయంపైనే పూర్తి దృష్టిసారించాయి. తమిళనాడులో ఈసారి ఖాతా తెరవాలని బీజేపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పలుసార్లు పర్యటించారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రెండూ అవినీతి, కుటుంబ పార్టీలని, వాటికి బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు.
అటు, మోదీ ప్రచారాన్ని కూడా డీఎంకే బలంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీని ఇకపై 29 పైసలు పేరుతో పిలవాలని తమిళనాడు సీఎం తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన చెన్నై నార్త్ డీఎంకే అభ్యర్థి కళానిధి వీరాసామికి మద్దతుగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాధవరం హైరోడ్డులో ఉదయనిధి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రత్యర్థులందరూ కలిసి కట్టుగా వచ్చినా తమ కూటమి భారీ విజయం సాధించిందని అన్నారు. ప్రస్తుతం ప్రత్యర్థులు విడిపోయి వేర్వేరు కూటములుగా పోటీపడుతున్నా అలసత్వం వద్దని సూచించారు.
విజయం మరింత సునాయాసమవుతోందని భావించవద్దని డీఎంకే నేతలకు స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థి విజయానికి గట్టిగానే కృషి చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలో అంతరాన్ని తగ్గించేలా రూ.1,000 కోట్లతో ప్రగతి ప్రాజెక్టును పది రోజుల కిందటే సీఎం స్టాలిన్ ప్రారంభించారని ఉదయనిధి పేర్కొన్నారు. చెన్నై నార్త్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన వివరించారు. భవిష్యత్తులో నార్త్ చెన్నైలో ప్రత్యేకంగా కాలుష్య నియంత్రణ బోర్డు ఏర్పాటుతో పాటు కొడుంగైయూర్‌లోని డంపింగ్‌యార్డును పునరుద్ధరించనున్నట్టు తెలిపారు.
ఐటీ, ఈడీ, సీబీఐ దాడులతో అన్నాడీఎంకే నేతలను బానిసలుగా చేసుకున్న మోదీ.. డీఎంకే నేతలనూ భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు డీఎంకే భయపడబోదని ఉద్ఘాటించారు. రాష్ట్రం నుంచి జీఎస్టీ కింద పన్నుగా తీసుకున్న ప్రతి రూపాయికి 29 పైసలు మాత్రమే మోదీ తిరిగి ఇస్తున్నారని, అందుకే ఆయన్ను 29 పైసలు పేరుతోనే పిలవాలని పేర్కొన్నారు. తమిళనాడును మాత్రమే వంచిస్తున్న ఆయనకు ఈ ఎన్నికల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని స్టాలిన్ కుమారుడు పిలుపునిచ్చారు. అయితే, ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.