పేదలకు ఫించన్ అందకుండా చేసే వైసీపీ కుట్రలను ఎందాకైనా అడ్డుకుంటామని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పైశాచికత్వానికి చంద్రబాబు పోరాటతత్వానికి మధ్య జరిగే పోరులో ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. చంద్రబాబు పోరాటం మానవత్వం కోసమని.. జగన్ పాకులాట మనుషుల్ని హింసించడమని మండిపడ్డారు. తెలుగుదేశం ధ్యేయం పేదల సంక్షేమం అయితే.. వైసీపీ లక్ష్యం శవ రాజకీయమని విమర్శలు గుప్పించారు. ప్రతీ ఎన్నికల్లానే ఈసారి వైసీపీ తన శవ రాజకీయాలకు అవ్వ తాతలను బలికోరుతోందన్నారు. పేదలకు ఫించన్ ఇప్పించే విషయంలో ఎందాకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ఫించన్ పంపిణీలో పేదల్ని ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న జగన్‌కు ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెప్తారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు.