ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారికి ఒడిశా భక్తుడి భారీ విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 05, 2024, 10:11 PM

తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళాన్ని అందించారు. భువ‌నేశ్వ‌ర్‌కుకు చెందిన బల్భద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం అందించింది. ఈ సంస్థ తరఫున ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర ఈ మేర‌కు విరాళం డీడీని తిరుపతిలోని పరిపాలన భవనంలో టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.


తిరుప‌తిలో ఘనంగా మెట్లోత్సవం


ధ‌ర్మ‌మార్గంలో న‌డుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భ‌గ‌వంతుడిని చేరుకోవ‌డ‌మే మెట్లోత్స‌వం అంత‌రార్థ‌మ‌ని అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్ట‌ర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ చెప్పారు. శ్రీ తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతిని పురస్కరించుకుని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం ఉదయం అలిపిరి పాదాలమండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరిగింది.


పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచివెళ్లి స్వామివారి కృపకు పాత్రులయ్యారన్నారు అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ. ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు. ఆంధ్ర‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ రాష్ట్రాల నుంచి విచ్చేసిన దాదాపు 2000 మందికి పైగా భ‌జ‌న మండ‌ళ్ల‌ సభ్యులు, ప్ర‌ముఖ సంగీత క‌ళాకారులు భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు. ఏప్రిల్ 5వ తేదీన శుక్రవారం సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం ఉంటుందని వివ‌రించారు.


ముందుగా ఆలిపిరి పాదాల మండపం వద్ద అన్నమాచార్య వంశీయులు మెట్లపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం చేపట్టారు. ఇందులో ‘బ్రహ్మ కడిగిన పాదము…., భావములోన బాహ్యమునందును…, ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు…, పొడగంటిమయ్య నిన్ను పురుషోత్తమా…, కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు” కీర్తనలున్నాయి. భక్తులు పరవశించి గోష్టిగానంలో పాలు పంచుకున్నారు.


సప్తవర్ణశోభితం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం


శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గురువారం ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు.


మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు. చామంతి, రోజాలు, గన్నేరు, సంపంగి, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, తామర, కలువ, మొగలిరేకులు, మాను సంపంగి పుష్పాలు, తులసి, దవనం, మరవం, బిల్వం, పన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారు. పుష్పయాగానికి 3 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. తమిళనాడు, కర్నాటక, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పుష్పాలు విరాళంగా అందాయి.


శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం


తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీ ఉగాది ఆస్థానం పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని గురువారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, స‌హ‌స్ర‌నామార్చ‌న నిర్వహించారు. త‌రువాత శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధి, శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి, శ్రీ ఆండాల్‌ అమ్మవారు, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ పుండరికవల్లీ ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa