చిన్నతనంలో నానమ్మ, తాత ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటారు. ఎక్కడికి వెళ్లినా వెంట పెట్టుకుని వెళ్తారు. ఆడించి, పాడించి చిన్నారులను లాలిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సైకిల్, బండిపై ఎక్కించుకుని ఊరంతా తిప్పుతూ ఉంటారు. ఆ సమయంలో తెలిసీ తెలియని ఆ చిన్నారులు.. తాను పెద్దయ్యాక పెద్ద పడవ లాంటి కారులో, విమానంలో ఎక్కిస్తానని గొప్పలు చెబుతూ ఉంటారు. అది విని తాతలు మురిసిపోతూ ఉంటారు. అయితే అలాంటి గొప్పే ఇపుడు నిజం అయింది. చిన్నతనంలో తనను తాత టీవీఎస్‌పై తిప్పగా.. ఇప్పుడు ఆ తాతను మనవడు విమానంలో తీసుకెళ్లాడు. అయితే ఆ విమానాన్ని నడిపింది కూడా ఆ మనవడే కావడం గమనార్హం. పైలట్‌గా మారిన తర్వాత తన తాతను విమానం ఎక్కించిన ఓ మనవడు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
తమిళనాడుకు చెందిన ప్రదీప్ కృష్ణన్ అనే ఓ పైలట్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చెన్నై నుంచి కోయంబత్తూర్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పైలట్ అయిన ప్రదీప్ కృష్ణన్.. విమానం చెన్నై నుంచి బయల్దేరే ముందు ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. అయితే ప్రయాణికులకు ఒక ముఖ్య విషయం చెప్పాలని పేర్కొన్నాడు. ఈ విమానంలో తనతోపాటు తన కుటుంబ సభ్యులు కూడా ప్రయాణిస్తున్నారని తెలిపాడు. అంతే కాకుండా తన తాతతో తొలిసారి విమానంలో ప్రయాణిస్తున్నట్లు చెప్పాడు.
ఈ విషయాన్ని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు నేను నా కుటుంబంతో పాటు ప్రయాణిస్తున్నాను. నా తాత, నానమ్మ, అమ్మ ఈ విమానంలోని 29 వ వరుసలో కూర్చున్నారు. ఇక ఇందులో మా తాత తొలిసారి నాతో విమానంలో ప్రయాణిస్తున్నారు. నా చిన్నతనంలో మా తాత టీవీఎస్50 బండిపై ఎన్నోసార్లు నేను వెనక కూర్చొని ప్రయాణించాను. కానీ ఇప్పుడు నా వంతు వచ్చింది. తాతను విమానంలో తిప్పే అవకాశం వచ్చింది అని ప్రదీప్ కృష్ణన్ తమిళ్, ఇంగ్లీష్ కలిపి మాట్లాడాడు.
ఇక అది విని ప్రదీప్ కృష్ణన్ తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే తన తాతకు ప్రయాణికులు అంతా ఒక హాయ్ చెప్పాలని ప్రదీప్ విజ్ఞప్తి చేశాడు. తన జీవితంలో ఇవి అద్భుత క్షణాలు అని ఎమోషనల్ అయ్యాడు. కుటుంబసభ్యులు, స్నేహితులతో విమానంలో ప్రయాణించాలని ప్రతీ పైలట్‌కు ఒక కల అని ప్రదీప్ కృష్ణన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రదీప్ కృష్ణన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక గతంలో 2018 లో తన తల్లి, నానమ్మను తొలిసారి విమానంలో తీసుకెళ్లాడు. ఆ సందర్భంగా వైరల్ అయిన వీడియోతో ప్రదీప్ కృష్ణన్ తొలిసారి వార్తల్లోకి ఎక్కాడు.
![]() |
![]() |