విశాఖ నగరంలో తుపాకీ సంస్కృతి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొంతమంది రౌడీషీటర్లు అడ్డదారిలో తుపాకీలను సమకూర్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, బిహర్ వంటి రాష్ట్రాల తుపాకులను తెప్పించుకుంటున్నారు. వాటిని సెటిల్‌మెంట్‌లు, ఇతరులను బెదిరించడం కోసం వినియోగిస్తున్నారు. వారం వ్యవధిలో నగరంలో మూడుచోట్ల లైసెన్స్ లేని తుపాకీలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 728 లైసెన్స్ తుపాకీలు ఉన్నాయి. ఇవికాకుండా కొంతమంది రౌడీషీటర్లు, యువకుల వద్ద లైసెన్స్ లేని పిస్టల్, రివాల్వర్లు ఉన్నాయి. రాజకీయ నేతల అండదండలు కలిగిన కొంతమంది రౌడీషీటర్లు బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి పిస్టల్, రివాల్వర్లలను తెప్పించుకుంటున్నారు. వాటిని చూపించి దందాలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. నగరంలో 650 మంది రౌడీషీటర్లు ఉండగా వీరిలో దాదాపు వంద మంది వరకూ రివాల్వర్, పిస్టల్, నాటు తుపాకీ వంటి వాటిని కలిగి ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం నగరంలో లైసెన్స్ కలిగిన తుపాకీలను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకుని స్టేషన్లలో డిపాజిట్ చేశారు. ఇలాంటి పరిస్థితిలో కేవలం వారం రోజుల వ్యవధిలో మూడుచోట్ల తుపాకీలు లభ్యంకావడం చర్చనీయాంశంగా మారింది. వన్‌టౌన్‌లో ఒక రౌడీషీటర్ రివాల్వర్‌తో తన ప్రత్యర్థిని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు అతడి వద్ద నుంచి పిస్టల్‌తోపాటు రెండు బుల్లెట్‌లను సాధీనం చేసుకున్నారు. ఆ తరువాత రెండు రోజులకే రామాటాకీస్ సమీపంలోని ఒక ప్రైవేటు ట్రావెల్స్ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తి నుంచి ఒక పిస్టల్, రివాల్వర్‌తోపాటు రెండు బుల్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల కిందట ఆరిలోవ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ కిట్టూ నుంచి ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి ముగ్గురు నుంచి తుపాకీలు బయటపడినప్పటికీ మరికొందరు రౌడీషీటర్లు, ఆకతాయిల వద్ద కూడా ఇలాంటి తుపాకీలు, రివాల్వర్లు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. భవిష్యత్తులో ఏదో ఒకరోజు బెదిరింపులు, సెటిల్‌మెంట్ల సమయంలో వీటిని బయటకు తీసే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గతంలో మాదిరిగా రౌడీషీటర్‌ల కదలికలపై గట్టి నిఘా ఏర్పాటుచేసినట్టయితే వారి ఆగడాలకు ముకుతాడు వేయడంతోపాటు వారి వద్ద ఉన్న లైసెన్స్ లేని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవచ్చునని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.