ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు-2024 సమీపిస్తున్న వేళ గెలుపు వ్యూహాలపై పార్టీలన్నీ దృష్టిసారించాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తవ్వడంతో ప్రచారపర్వాన్ని ముమ్మరం చేయడంపై పార్టీలన్నీ దృష్టిసారించాయి. ఇప్పటికే ప్రచారంలో ఉన్న నేతలంతా మరింత దూకుడు పెంచడమే లక్ష్యంగా షెడ్యూల్‌ను ప్రకటిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తాజా ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 7వ తేదీన (ఆదివారం) అనకాపల్లి, 8న ఎలమంచిలిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇక 9న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. కాగా పవన్ కల్యాణ్ ఇటీవలే ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించారు. జ్వరం కారణంగా ‘వారాహి విజయభేరి’ సభలకు ఆయన స్వల్ప విరామం ఇచ్చారు. అయితే జ్వరం తగ్గడంతో ఆయన 3 రోజుల పర్యటనను ఖరారు చేశారు. ఇక నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా త్వరలోనే ఆయన ఖరారు చేయనున్నారని జనసేన నేతలు చెబుతున్నారు.