శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ నెలలో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్తున్న భక్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు 3 రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా సాలకట్ల వసంతోత్సవాలను మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించనున్నారు.
సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. ఆ తర్వాత వసంతోత్సవ మండపంలో స్వామివారికి వసంతోత్సవ అభిషేక నివేదనలు చేస్తారు. ఇవి పూర్తైన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండో రోజైన ఏప్రిల్ 22న మలయప్పస్వామి ఉదయం 8 నుంచి10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. ఆ తర్వాత వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.
మూడో రోజు, చివరి రోజైన ఏప్రిల్ 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. వసంతోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. అలాగే సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.
వసంత ఋతువులో జరుగుతుంది కావున ఈ ఉత్సవానికి వసంతోత్సవమనే పేరు వచ్చింది. వసంతోత్సవంలో సుగంధ పుష్పాలను, ఫలాలను స్వామికి నివేదిస్తారు. మరోవైపు వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 23న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాలను భక్తులు గమనించాలని సూచించింది.