సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అధికారులు తనిఖీలు ముమ్మురం చేశారు. ఓ వైపు పోలీసులు, మరోవైపు ఎన్నికల కమిషన్‌కు చెందిన ఫ్లయింగ్ స్క్వాడ్‌లు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికల్లో ధన, మద్యం పంపిణీని అడ్డుకునే చర్యల్లో భాగంగా అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లాలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. ఏలూరు జిల్లా కలపర్రు టోల్ గేట్ వద్ద సోమవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చి ఓ వాహనంలో తనిఖీలు జరపగా.. సుమారు 50 కేజీల బంగారు, వెండి ఆభరణాలను అందులో గుర్తించారు. ఓ కారులో సుమారు 22 కేజీల బంగారం, 31 కేజీల వెండి ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి వాహనంలోని వ్యక్తులు సరైన పత్రాలు చూపకపోవటంతో బంగారం, వెండి మొత్తాన్ని సీజ్ చేశారు.
ఈ విషయంపై ఏలూరు జిల్లా పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, నూజివీడు డిఎస్పి లక్ష్మయ్య ఆదేశాలపై పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కలపర్రు టోల్ గేట్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఎనిమిదో తేదీ రోజు పెదవేగి సీఐ శ్రీనివాస్ కుమార్, పెదపాడు ఎస్సై శుభశేఖర్ సిబ్బందితో కలిసి సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో 50 కేజీలు బంగారం, వెండి ఆభరణాలను సరైన ధ్రువపత్రాలు లేకుండా రవాణా చేస్తుండగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. సదరు బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని వివరాలు సేకరిస్తున్నట్లు తెలియజేశారు.
మరోవైపు బంగారం, వెండి ఆభరణాలను విజయవాడ నుంచి భీమవరానికి తరలిస్తున్న సమయంలో పట్టుకున్నట్లు పెదవేగి సీఐ శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశామన్నారు. దీనిపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో హనుమాన్ జంక్షన్ నుంచి వాహనంలో తరలిస్తున్న రూ.15లక్షల నగదును కూడా పోలీసులు సీజ్ చేశారు.