జనసేన పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత పోతిన మహేష్ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. విజయవాడ వెస్ట్ స్థానం ఆశించారు పోతిన మహేష్. ఈసారి అక్కడి నుంచి ఎలాగైనా బరిలోకి దిగాలని భావించారు. అయితే ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి దక్కగా.. బీజేపీ నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే అసంతృప్తికి గురైన పోతిన మహేష్.. జనసేన పార్టీ రాజీనామా చేశారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
"పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం ప్రజలకు తెలిసింది . పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. జనసేన పార్టీ నిర్మాణం మీద, క్యాడర్ మీద ఏరోజు కూడా పవన్ కళ్యాణ్ దృష్టి సారించలేదు. పవన్‌ది అంతా నటనే. పవన్ సిద్ధాంతాలు అన్ని స్వార్ధ పూరితం. పవన్ గురించి తెలిసే ఆయన్ని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు" అంటూ పోతిన మహేష్ విమర్శించారు.
మరోవైపు 21 సీట్లతో జనసేన పార్టీకి ఏం భవిష్యత్తు ఉంటుందని పోతిన మహేష్ ప్రశ్నించారు. 25 రోజుల తరువాత పార్టీ పరిస్థితి ఏంటో చెప్పగలరా అని నిలదీశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామనీ.. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఇంకో ఇరవై ఏళ్ళు కొనసాగుతుందో లేదో తెలియని పరిస్థితి ఉందని పోతిన మహేష్ అభిప్రాయపడ్డారు. ఇక జనసేన పార్టీ లో పనిచేసిన వారికి ఎందుకు సీట్లు కేటాయించలేదని ప్రశ్నించిన పోతిన మహేష్..టీడీపీ వారికే ఎందుకు సీట్లు ఇచ్చారని నిలదీశారు. దీనిపై పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ సమాధానము చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.
కాపు సామాజికవర్గాన్ని బలి చేస్తున్నారన్న పోతిన మహేష్.. కాపు యువతను మోసం చేయవద్దని సూచించారు. వీరమహిళల పదవీ కాలం పొడిగించిన జనసేన.. మిగతావారి పదవులు ఎందుకు పొడిగించలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తల్లిని దూషించిన సుజనా చౌదరికి ఏవిధంగా సీట్ ఇస్తారని.. పచ్చనోట్లు పడేస్తే అన్నీ మర్చిపోతారా అని పోతిన మహేష్ ప్రశ్నించారు. టీడీపీ, జనసేన పార్టీకి పది స్థానాలు కుక్క బిస్కెట్లలా పడేసిందని ఆరోపించారు. రాజధాని ప్రాంత పరిధిలో జనసేన పార్టీని చంపేశారన్న పోతిన మహేష్.. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే బయటపెడతానని చెప్పారు.
ఇక సీట్ల సర్దుబాటుపైనా పోతిన మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. " బీజేపీ టీడీపీని సీట్లు సర్దుబాటు చేయమంది. జనసేన ఎందుకు సీట్లు ఇవ్వాలి. జనసేన పార్టీ పొత్తు కుదిర్చితే సీట్లు ఎందుకు తగ్గించుకోవాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పోటీ చేయడానికి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా. పార్టీకి విధేయుడిగా ఉంటే నమ్మక ద్రోహం చేస్తారా? టీడీపీ, జనసేన పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గంలో సర్వే చేసి.. గెలిచే పశ్చిమ నియోజకవర్గం సీటును ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది? త్యాగాలకు బీసీలు కావాలా...కమ్మ సామజిక వర్గం పనికి రాదా?" అంటూ పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.