అతివలు ఆకాశంలో సగం అంటే.. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని.. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ముందుండాలనేది దాని అర్థం. అమ్మాయిలకు స్వేచ్ఛను ఇవ్వాలని.. వారిని ఎదగనివ్వాలనేది ఆ మాటల వెనకున్న అంతరార్థం. నేటి తరం అమ్మాయిలు దానికి తగ్గట్టుగానే.. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. అయితే కొందరు మాత్రం స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని.. చెడు వ్యసనాలకు లోనై, అనవసర కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మీరు చదవబోయే ఉదంతం కూడా ఈ కోవలోకే వస్తుంది.
అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా సిగరెట్లు, డ్రగ్స్ వాడకానికి అలవాటు పడి.. క్రమంగా వాటికి బానిసలవుతున్నారు. ఈ మత్తులో.. ఏం చేస్తున్నామనే విచక్షణ లేకుండా.. హత్యలకు సైతం వెనుకాడటం లేదు. ఓ యువతి.. ఓ యువకుణ్ని హత్య చేసిన ఘటనతో నాగ్‌పూర్ వాసులు ఉలిక్కి పడ్డారు. 24 ఏళ్ల జయశ్రీ పంధరే అనే యువతి.. తన స్నేహితురాలు సవిత సయారేతో కలిసి శనివారం రాత్రి మనెవాడ సిమెంట్ రోడ్‌లోని ఓ పాన్ షాప్ దగ్గర నిలబడి సిగరెట్ వెలిగించింది. జయశ్రీ సిగరెట్ తాగుతుండటాన్ని రంజిత్ రాథాడ్ అనే 28 ఏళ్ల యువకుడు చూశాడు. అతడు చూసీచూడనట్టుగా వదిలేస్తే బాగానే ఉండేది. కానీ రంజిత్ మాత్రం ఆమెవైపు అదే పనిగా చూడటం మొదలుపెట్టాడట.
రాథోడ్ అలా చూడటంతో జయశ్రీకి చిర్రెత్తుకొచ్చింది. సిగరెట్ తాగుతూ.. పొగను రింగులు రింగులుగా.. అతడి వైపు వదులుతూ మొదలుపెట్టింది. పనిలో పనిగా నోటికి సైతం పని చెప్పింది. దీంతో రాథోడ్ జేబులో నుంచి ఫోన్ తీసి వీడియో తీయడం మొదలుపెట్టాడు. ఇది ఇద్దరి మధ్యా వాగ్వాదానికి దారి తీసింది. ఆగ్రహానికి గురైన జయశ్రీ.. తన స్నేహితులు ఆకాశ్ రౌత్, జీతూ జాదవ్‌లను ఫోన్ చేసి పిలిచింది. దీంతో వారంతా కలిసి రాథోడ్‌తో గొడవ పడ్డారు. ఈ వాగ్వాదం తర్వాత ఇంటికి బయలుదేరిన రాథోడ్.. దారి మధ్యలో మహాలక్ష్మి నగర్‌లో బీర్ తాగడానికి ఆగాడు. అదే అదనుగా.. జయశ్రీ, ఆమె స్నేహితులు రాథోడ్‌పై దాడి చేశారు. జయశ్రీ అతణ్ని కత్తితో కసితీరా పొడిచింది. దీంతో అతడు కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. హత్యకు అసలు కారణం పాన్ షాప్ దగ్గర జరిగిన గొడవేనని తెలిసింది. రాథోడ్ ఫోన్ తీసి చూడగా.. అందులో జయశ్రీ అతడి వైపు సిగరెట్ పొగను రింగులు రింగులుగా వదలడం, దూషించడం కనిపించింది. దానికి రాథోడ్ కూడా నోటితో బదులివ్వడాన్ని పోలీసులు గమనించారు. హత్య తరువాత నలుగురు కలిసి దత్తవాడికి పారిపోయారు. తర్వాత అక్కడి నుంచి కల్మేశ్వర్‌లోని మోహోపాకు పరారయ్యారు. అయితే పోలీసులు వెతకగా.. జయశ్రీ, సవిత, ఆకాష్‌లు పట్టుబడ్డారు. దత్తవాడిలో జరిపిన సోదాల్లో.. నిందితుల ఫోన్లలో డ్రగ్స్ ఫొటోలతోపాటు ఇతర అభ్యంతరకరమైన వస్తువులను సైతం పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో సీసీటీవీ ఫుటేజీతోపాటు.. హతుడి ఫోన్లోని వీడియో కీలకంగా మారిందని పోలీసులు చెప్పారు. ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సైతం ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్నాడన్నారు.