హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్లలో.. వధువు తల్లిదండ్రులు వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం, ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టడం ఎప్పటి నుంచో వస్తోన్న ఆచారం. అత్తమామలు వరుడిని శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించి.. లక్ష్మీ దేవి స్వరూపమైన తమ కూతుర్ని అల్లుడికి దానం ఇవ్వడమే కన్యాదానం. అంతేకాదు కన్యాదానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందని కూడా పెద్దలు చెబుతారు. అందుకే పెళ్లి కూతురు తల్లులు లేదా కన్యాదానం చేసేవారు వివాహం పూర్తయ్యే వరకు ఆహారం తీసుకోరు. హిందూ వివాహ వ్యవస్థలో కన్యాదానానికి ఇంతటి ప్రాధాన్యం ఉండగా.. కోర్టు మాత్రం హిందూ వివాహ చట్టం ప్రకారం కన్యాదానం తప్పనిసరేం కాదని చెబుతోంది.
ఇటీవల ఓ కేసు విషయమై అలహాబాద్ హైకోర్టు జడ్జి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కన్యాదానం చేయడం తప్పనిసరేం కాదు.. సప్తపది (నవదంపతులు కలిసి ఏడడుగులు వేయడం) మాత్రమే పెళ్లిలో తప్పనిసరి చేయాల్సిన కార్యక్రమం అని లక్నో బెంచ్ జడ్జి తీర్పునిచ్చారు. ఇంతకూ విషయం ఏంటంటే.. అశుతోష్ యాదవ్ అనే వ్యక్తిపై అత్తామామలు క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసులో తన వాదనలు వినిపించిన అశుతోష్.. హిందూ వివాహ చట్ట ప్రకారం కన్యాదానం చేయాల్సి ఉండగా.. అత్తమామలు తనకు కన్యాదానం చేయలేదని, కాబట్టి తన పెళ్లి చట్టబద్ధం కాదని కోర్టు ముందు వాదించాడు. దీనికి సంబంధించి లక్నో బెంచ్‌లో రివిజన్ పిటీషన్ కూడా దాఖలు చేశాడు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా.. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కన్యాదానం చేయడం తప్పనిసరి కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఆ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం సప్తపది మాత్రం తప్పనిసరి అని కోర్టు తెలిపింది.
ఇటీవలి కాలంలో కన్యాదానం గురించి మాట్లాడే వారి సంఖ్య పెరిగింది. మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ.. ఉద్యోగాలు చేస్తూ పురుషులతో సమానంగా సంపాదిస్తున్నప్పుడు.. కన్యాదానం చేయడం ఏమిటి..? దానం చేయడానికి ఆడవాళ్లు ఏమైనా వస్తువులా? అని ప్రశ్నించే వాళ్లు కూడా ఉన్నారు. కన్యాదానం విషయమై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మీరు ఏకీభవిస్తారా..? మీ అభిప్రాయం ఏంటి..?