కొందరు కార్యకర్తలు చేసే పనులు ఆ పార్టీల అగ్రనేతలకు తలనొప్పిగా మారతాయి. ఎన్నికల సమయంలో ఎంతో హడావుడి ఉన్నా చేసే పనిలో ఏదైనా చిన్న లోపం కనిపిస్తే చాలు ప్రత్యర్థులకు అదే ఆయుధం అవుతుంది. ఇక ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏదైనా దాచిపెట్టాలని ఎంత ప్రయత్నించినా అది దాగడమే కాకుండా వైరల్ అయి.. మరింత నవ్వుల పాలు అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా అదే జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత ప్రసంగించాల్సిన వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్‌లో బీజేపీ నేత ఫోటో ఉండటం వైరల్‌గా మారింది. అది కూడా కేంద్రమంత్రి ఫోటో కావడం గమనార్హం. దీంతో ఆ ఫోటో కనిపించకుండా చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు నానా తంటాలు పడ్డారు. ఎట్టకేలకు ఓ వైట్ షీట్ కప్పి ఆ ఫోటోను కవర్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి ఫన్నీ రియాక్షన్లు వస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లో సోమవారం నుంచి రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే దక్షిణ సియోనీ జిల్లాలోని ధనోరా వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వేదికను ఏర్పాటు చేసి దానిపై పార్టీ నేతల ఫోటోలతో కూడిన బ్యానర్ ఏర్పాటు చేశారు. అయితే అందులో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఫోటోలు ప్రింట్ చేయించారు. వీరితోపాటు కేంద్రమంత్రి, బీజేపీ నేత ఫగ్గన్ సింగ్ కులస్తే ఫోటో ఉండటం అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది గుర్తించిన స్థానిక నేతలు ఈ ఫోటో ఎవరు వేయించారు అని అడగ్గా.. తెలియదు అని అక్కడ ఉన్న కార్యకర్తలు చెప్పడం ఆ వీడియోలో రికార్డ్ అయింది. దీంతో వెంటనే చర్యలు చేపట్టిన నేతలు.. కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఫోటో ఉన్న స్థానంలో వైట్ షీట్ ఒకటి అంటించారు.
దీంతో ఆ వివాదానికి తెర పడినా.. వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా ఆ ఫగ్గన్ సింగ్ కులస్తే ఫోటో.. ప్రియాంక గాంధీ ఫోటో కిందే ఉండటం గమనార్హం. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. మొత్తానికి ఇవాళ మల్లిఖార్జున ఖర్గే నిజం చెప్పారని ట్విటర్‌లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన బీజేపీ.. ఆ వీడియోను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ట్విటర్‌లో షేర్ చేసింది