భారత్‌కు మాల్దీవులు కృతజ్ఞతలు తెలిపింది. అదేంటీ నిన్నటివరకు భారత్ పట్ల అక్కసు వెళ్లగక్కడం, భారత్‌కు శత్రుదేశంగా ఉన్న చైనాతో దోస్తీ చేయడమే కాకుండా ఆ దేశంతో పలు కీలక ఒప్పందాలు చేసుకున్న మాల్దీవులు ఇలా చేయడానికి కారణం ఏంటి. ఇవన్నీ పక్కన పెడితే మాల్దీవుల్లో సేవలు అందిస్తున్న భారత సైన్యాన్ని వెళ్లిపోవాలని గతేడాది అధికారంలోకి వచ్చిన మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ తేల్చి చెబుతున్న వేళ.. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నయి. అయితే భారత్ నుంచి నిత్యం సాయం పొందే మాల్దీవులు.. భారత్ పట్ల ఇలాంటి వైఖరి అనుసరించడం సంచలనంగా మారింది. అయితే చైనా అనుకూల వ్యక్తి అయిన మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ.. భారత్ పట్ల అనుసరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. అయితే ఇవేమీ పట్టించుకోని భారత్.. ఆ దేశానికి సాయం చేస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే మాల్దీవులుతో దౌత్యపరంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నా.. భారత్‌ను కాదని, చైనా అనుకూల వైఖరిని మహ్మద్ ముయిజ్జూ అవలంభిస్తున్నప్పటికీ.. మాల్దీవులకు భారత్ సాయం చేసింది. మాల్దీవులుకు అవసరమైన నిత్యావరసర వస్తువులను భారత్ ఎగుమతి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 2024-25 ఆర్థిక సంవత్సరంలో మాల్దీవులకు అవసరమైన వస్తువులను సరఫరా చేసేందుకు భారత్ తాజాగా అనుమతించింది. దీనిపై స్పందించిన మాల్దీవులు మంత్రి మూసా జమీర్ భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తీసుకున్న నిర్ణయం రెండు దేశాల మధ్య చిరకాల స్నేహాన్ని, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించాలనే బలమైన నిబద్ధతను తెలియజేస్తోందని మూసా జమీర్ పేర్కొన్నారు.
వచ్చే ఆర్థిక ఏడాదిలో భారత్ నుంచి మాల్దీవులు దిగుమతి చేసుకునే అవసరమైన వస్తువులకు సంబంధించిన కోటాను పునరుద్ధరించినందుకు భారత ప్రభుత్వానికి, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు తాను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మూసా జమీర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. చిరకాల స్నేహం, భారత్-మాల్దీవులు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించడానికి నిబద్ధతను సూచిస్తుందని మూసా జమీర్ ట్వీట్ చేశారు.
మాల్దీవులు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాదికి గాను 1,24,218 మెట్రిక్ టన్నుల బియ్యం.. 1,09,162 టన్నుల గోధుమ పిండి.. 64,494 టన్నుల చక్కెర.. 21,513 మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు.. 35,749 టన్నుల ఉల్లిపాయలు.. 427.5 మిలియన్ గుడ్లను ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతులు ఇచ్చింది. ఈ నిత్యావసర సరుకులతోపాటు 10 లక్షల టన్నుల కంకర రాయి, నది ఇసుకను ఎగుమతి చేసేందుకు కూడా భారత్ అనుమతించింది. దీంతో మాల్దీవులు భారత్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇక మాల్దీవుల మంత్రి మూసా జమీర్ భారత్‌కు థ్యాంక్యూ చెప్పడంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. ‘‘ యు ఆర్ వెల్‌కమ్ మూసాజమీర్ అని పేర్కొన్నారు. ఇరుగు పొరుగున ఉన్న దేశాలు ఫస్ట్ అనేది భారత్ విధానమని స్పష్టం చేశారు. సాగర్ విధానాలకు భారత్ కట్టుబడి ఉంది అని తేల్చి చెప్పారు. భారత్ చుట్టు పక్కల ఉన్న ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక ఫస్ట్ అనే విధానాన్ని అవలంభిస్తోంది.