1901 తర్వాత అత్యంత వేడి సంవత్సరంగా 2023 రికార్డుల్లోకి ఎక్కింది. గతేడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో భూమిని తాత్కాలికంగా చల్లబరచడానికి కొన్ని సూర్య కిరణాలను వెనక్కి పంపేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించినట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదిక తెలిపింది. ఇందుకోసం మేఘాలను ప్రకాశవంతం చేసే సాంకేతికతను వారు ఉపయోగించారు. ఈ సాంకేతికత సూర్యుడి నుంచి వచ్చే కాంతి చిన్నదిగా ప్రతిబించేలా చేస్తుంది.. ఫలితంగా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. మహాసముద్రాలపై అనేక పరికరాలను ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రయోగం విజయవంతమైతే పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలకు చక్కని పరిష్కారాన్ని చూపుతుంది.
యుద్ధనౌకపై నుంచి ప్రయోగం
ఏప్రిల్ 2న యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు శాన్ ఫ్రాన్సిస్కోలో విమాన వాహక నౌకపై ఉంచిన స్నో మిషీన్ లాంటి పరికరం నుంచి అధిక వేగంతో ఆకాశంలోకి ఉప్పు కణాలతో కూడిన పొగమంచును ప్రయోగించారు. ‘కోస్టల్ అట్మాస్ఫియరిక్ ఏరోసోల్ రీసెర్చ్ అండ్ ఎంగేజ్‌మెంట్ లేదా CAARE’అనే రహస్య ప్రాజెక్ట్ కింద ఈ ప్రయోగం చేపట్టారు. 1990లో బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త జాన్ లాథమ్ వివరించిన సూర్యకాంతిని ప్రతిబింబించే మేఘాలను అద్దాలుగా ఉపయోగించాలనే థియరీ ఆధారంగా ఈ ప్రయోగం చేపట్టారు. 1,000 నౌకల సముదాయంతో సముద్ర నీటి బిందువులను గాలిలోకి పంపడం ద్వారా వేడిని వెనక్కి పంపి భూమి ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చని లాథమ్ సూచించారు.
ఇది ఎలా పని చేస్తుంది?
సాంకేతికత వెనుక ఉన్న ఆలోచన సాధారణ సైన్స్‌ను ఉపయోగిస్తుంది: పెద్ద సంఖ్యలో చిన్న బిందువులు.. తక్కువ మొత్తంలో ఉన్న పెద్ద బిందువుల కంటే ఎక్కువ సూర్యరశ్మిని ప్రతిబింబిస్తాయి. కాబట్టి గాలిలోకి ఉప్పు నీటి కణాలను పొగమంచు మాదిరిగా స్ప్రే చేయడం వల్ల సూర్యకాంతి తిరిగి వెనక్కి వెళ్తుంది. కానీ కణాల పరిమాణం, వాటి మొత్తాన్ని సక్రమంగా పొందడం చాలా కీలకం. కణాలు చాలా చిన్నగా ఉంటే అవి ప్రతిబింబించవు. చాలా పెద్ద కణం మేఘాలను మరింత తక్కువగా ప్రతిబింబిస్తుంది. ఈ పరీక్ష కోసం వెంట్రుక మందంలో 1/700వ వంతు ఉండే కణాలు అవసరం. ప్రతి సెకనుకు క్వాడ్రిలియన్ కణాలను స్ప్రే చేయాల్సి ఉంటుంది.
ఇది గ్లోబల్ వార్మింగ్‌తో పోరాడగలదా?
ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణకు పూర్వం ఉన్న ఉష్ణోగ్రతల కంటే 1.5 డిగ్రీలను తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతున్నందున శాస్త్రవేత్తలు శీఘ్రంగా గణనీయమైన ఫలితాలను ఇచ్చే కొత్త పరిష్కారాల కోసం చూస్తున్నారు. ఈ ప్రక్రియ కార్బన్‌డైక్సైడ్ కారణంగా పెరిగిన గ్లోబల్ వార్మింగ్‌ను సమతౌల్యం చేయగలదని కొందరు భావిస్తున్నప్పటికీ సోలార్ మోడిఫికేషన్ మెథడ్ ఫలితాలను అంచనా వేయడం కష్టమని పలువురు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాంకేతికత అధిక వినియోగం, కాలక్రమేణా వాతావరణ నమూనాలను మార్చగలదని అంటున్నారు. ఉదాహరణకు మారుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు జీవశాస్త్రం, వర్షపాతాన్ని మార్చగలవు. ఒక ప్రాంతంలో వర్షపాతం పెరిగితే.. మరొక ప్రాంతంలో తగ్గుతుంది.