రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపుతోనే మార్కాపురం జిల్లా ఏర్పాటు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి సాధ్యమవుతుందని టీడీపీ కూటమి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం మండలంలోని పెద్ద యాచవరం గ్రామంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మార్కాపురం ప్రత్యేక జిల్లాతోనే మార్కాపురం చుట్టుప్రక్కల ప్రాంతాల భూములు రేట్లు పెరిగి రైతులు బాగుపడతారని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి పొలాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని అన్నారు. ఈ విషయాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరికి వివరిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు జవ్వాజి రామానుజన్ రెడ్డి, కాకర్ల శీను, తాండ్ర వెంకటేశ్వర్లు, పెద్ద యాచవరం గ్రామం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.