వైయస్ కుటుంబ పడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, వైయస్ కుటుంబ పరువును రోడ్డుకు తీసుకువస్తున్నారని మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి సోదరి విమల ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీతలు ఏది మాట్లాడినా కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నారని, వివేకా కేసులో నిత్యం అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ ఇంట్లో అమ్మాయిలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని అల్లరి పెట్టడం బాధగా అనిపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ విమల శనివారం మీడియాతో మాట్లాడుతూ..... మా ఇంటి ఆడపడుచులు ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారు. మా కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నాను. నేనూ ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నా. షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూసాను. షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదు. నిత్యం షర్మిల అవినాష్‌ను విమర్శిస్తున్నారు. అవినాష్ హత్య చేయడం ఆ ఆడపిల్లలిద్దరూ చూశారా?. సీఎం జగన్‌ను కూడా దీంట్లోకి లాగుతున్నారు. వాళ్లే(షర్మిల, సునీతలు) డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు?. హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు. అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా? అని ఆగ్రహం వ్యక్తపరిచారు.