ఏపీలో రాజకీయ నేతలపై రాళ్లదాడులు కలకలం రేపుతున్నాయి. శనివారం సీఎం వైఎస్ జగన్ మీద గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసరగా.. ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద ఆకతాయిలు రాళ్లు విసిరారు. అలాగే తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద సైతం రాళ్లదాడి జరిగింది. రాళ్లదాడి ఘటనల్లో జగన్ గాయపడగా.. అదృష్టవశాత్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న ప్రజాగళం సభలో తీవ్ర కలకలం రేగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఆదివారం సాయంత్రం గాజువాకలో పర్యటించారు. గాజువాకలో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్నారు. అయితే చంద్రబాబు ప్రసంగించే సమయంలో ఓ దుండగుడు ఆయనపైకి రాయి విసిరారు. చంద్రబాబు ఉన్న ప్రజాగళం వాహనం వెనుకవైపు నుంచి ఆగంతకుడు రాయి విసిరారు. అయితే ఈ ఘటనలో చంద్రబాబుకు ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగుణ్ని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే అతను పారిపోయాడు. ఈ నేపథ్యంలో రాయి విసిరిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరోవైపు తనపైకి రాయి విసరటంపై చంద్రబాబు మండిపడ్డారు. పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం చీకట్లో సీఎం జగన్‌పై గులకరాయి పడిందని.. ఇవాళ కరెంట్ ఉన్నప్పుడే తనపై రాయి విసిరారంటూ చంద్రబాబు మండిపడ్డారు. తెనాలిలో పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్లు వేశారన్న చంద్రబాబు.. దీని వెనుక గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ హస్తం ఉన్నట్లు ఆరోపించారు. గతంలో కూడా తనపై రాళ్లు వేశారన్న చంద్రబాబు.. క్లైమోర్ మైన్స్‌కే భయపడని వ్యక్తిని రాళ్లకు భయపడతానా అని అన్నారు.
మరోవైపు విజయవాడలో సీఎం జగన్ మీద జరిగిన రాళ్లదాడి తాము చేయించినట్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. రాళ్లు విసిరిన వారిపై చర్యల తీసుకోవాలనిడిమాండ్ చేశారు. రాళ్ల దాడులు జరుగుతుంటే పోలీసులు, నిఘావర్గాలు ఏం చేస్తున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.