బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో రెండు రోజుల కిందట కోల్‌కతాలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనుమానిత ఉగ్రవాదులు ముసావిర్ హుసేన్ శాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాలను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా. వారికి పది రోజుల కస్టడీకి అనుమతించారు. నిందితులు బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు వ్యూహరచన చేసినట్టు గుర్తించారు. బాంబుల తయారీ, పేలుడు అనంతరం తప్పించుకోవడం, రూట్ మ్యాప్ రూపకల్పన తదితరాల్లో వీరిద్దరూ సిద్ధహస్తులని వెల్లడయ్యింది.
ట్రాన్సిట్ వారెంట్‌పై తీసుకొచ్చిన నిందితులను మడివాళలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని ప్రత్యేక సెల్‌లో ఉంచారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితుల్లో ఒకరైన ముసావీర్... నకిలీ ఆధార్, ఐడెంటిటీ కార్డులను సృష్టించి, పేర్లు మార్చుకుని తిరిగినట్టు తేలింది. చెన్నైలో విఘ్నేశ్, మహ్మద్ జునైద్ సయ్యద్, సంజయ్ అగర్వాల్, ఉదయ్ దాస్, కోల్‌కతాలో అన్మోల్ కులకర్ణి, యశు శహనవాజ్ పాటిల్ తదితర పేర్లు పెట్టుకుని తిరిగాడు. ఇద్దరు నిందితులు కోల్‌కతాలో 12 రోజుల పాటు రోజుకో ప్రదేశంలో తలదాచుకుంటూ వచ్చారు.
ఇక, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అబ్దుల్ మతీన్ తహానా.. తండ్రి మాజీ సైనికుడు. అనారోగ్యంతో అతడు గత ఏడాది చనిపోయాడు. ఉన్నత విద్య కోసం బెంగళూరుకు రావడానికి ముందు మతీన్.. తీర్థహళ్లిలో ఉన్నాడు. ఇంజినీరింగ్‌లో ఉండగా ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. సైనికుడిగా సేవలు అందించిన మతీన్ తండ్రి మన్సూర్ అహ్మద్ రిటైర్మెంట్ తర్వాత కుటుంబం తీర్థహళ్లిలో స్థిరపడింది. స్థానిక చేపల మార్కెట్ సమీపంలో ఓ ఇంటిలో నివాసం ఉండేవారు. మంగళూరు కుక్కర్ బాంబ్ పేలుడు, శివమొగ్గ వద్ద బాంబు పేలుడు ఘటనల వెనుక మాస్టర్ మైండ్ ఇతడేనని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. తన కుమారుడు ఉగ్రవాదిగా మారిన విషయం తెలిసి మతీన్ తల్లి షాక్‌కు గురయ్యారు. ముసావీర్‌ది కూడా తీర్థహళ్లిలో ఓ సాధారణ కుటుంబం. తండ్రి చనిపోవడంతో తల్లి, తోబుట్టువుల కలిసి ఉంటున్నాడు. ముసావీర్, మతీన్‌లు చిన్ననాటి స్నేహితులు.. ఇద్దరూ కలిసి పెరిగారు.