‘సంకల్ప్ పత్ర’ పేరులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా ఈ మేనిఫెస్టోను రూపొందించింది. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల మేనిఫేస్టో కమిటీ 15 లక్షల మంది నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, అధునాతన దేశంగా భారత్ అవతరించేందుకు మోదీ సారథ్యంలో బీజేపీ అనుసరించబోయే విధానాలను వివరిస్తూ మేనిఫెస్టోను విడుదల చేసింది.
మొత్తం 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. సమృద్ధ్ భారత్, విశ్వబంధు, సురక్షిత భారత్, ప్రపంచస్థాయి మౌలికవసతుల కల్పన, స్వచ్ఛ భారత్, ఈజ్ ఆఫ్ డూయింగ్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సాంకేతిక వికాసం, సంతులిత అభివృద్ధి వంటి అంశాలను చేర్చింది. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఉదయం 8:30కి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ప్రధాని మోదీ ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు.
మేనిఫెస్టోలోని అంశాలను వివరించిన ప్రధాని మోదీ పేదలు, రైతులు, మహిళలు, యువత అభివృద్ధే మా లక్ష్యమని తెలిపారు. ‘పేదలకు ఇంటింటికి పైప్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇస్తాం.. సూర్య ఘర్ పథకం కింద ఉచితంగా విద్యుత్తు సరఫరా, ఇంటి పైకప్పు నుంచి సౌర విద్యుత్ ఉత్పత్తితో ఆదాయం.. మూడు కోట్ల మంది మహిళలను లక్ష అధికారులను చేస్తాం..
ఐదేళ్లపాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్.. చిల్లర వర్తకులకు గ్యారెంటీ లేకుండా రూ.50 వేల రుణాలు.. ముద్ర పథకం రుణం 20 లక్షల రూపాయలకు పెంపు.. 10 కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ పథకం కొనసాగింపు.. మూడు కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఇల్లు నిర్మిస్తాం.. తమిళ భాషకు విశ్వ వ్యాప్తి కల్పిస్తాం.. 70 ఏళ్లు పూర్తయినవారికి ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు.. దేశం నాలుగు దిక్కుల్లో నాలుగు బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టిస్తాం.. అవినీతిపరులను జైలుకు పంపిస్తాం’ అని మోదీ తెలిపారు.
వచ్చే ఐదేళ్లూ దేశానికి ఏం చేయబోతున్నామో ఇందులో వివరించారు. విడుదల కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. అంబేద్కర్ జయంతి రోజున మేనిఫెస్టో విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. 2014లో ప్రధాని అయిన తర్వాత పేదల కోసమే బీజేపీ ప్రభుత్వం అని మోదీ చెప్పారు. మోదీ నేతృత్వంలోని పదేళ్లలో దేశం ఎంతో ప్రగతి సాధించిందని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించామని నడ్డా పేర్కొన్నారు. 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందజేస్తున్నామని అన్నారు.