బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల కలకలం రేగింది. ముంబయిలోని బంద్రాలో ఆయన నివాసం బయట ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించినట్టు పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి.. పలు రౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరిపి.. అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. తక్షణమే రంగంలోకి దిగారు. కాల్పుల జరిపిన ఆగంతకుడ్ని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు.. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉందని, వారి ప్రధాన లక్ష్యాల్లోని టాప్ 10లో ఆయన ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గతేడాది వెల్లడించింది. సల్మాన్ హత్యకు గ్యాంగ్ కుట్రలు చేస్తోందని తెలిపింది. 1998లో కృష్ణజింకలను వేటాడిన ఘటనకు ప్రతీకారంగా ఆయన్ను చంపుతామని బెదిరించింది. గతేడాది ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన ఓ ఆగంతకుడు.. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరించాడు. ఆగంతుకుడు తన పేరు రాకీ భాయ్ అని, జోధ్పూర్‌కు చెందిన గోరక్షకుడినని ఫోన్ లో చెప్పాడు. 2018లో విచారణ కోసం కోర్టుకు వచ్చిన బిష్ణోయ్ గ్యాంగ్ .. కోర్టు ఆవరణలోనే సల్మాన్ ఖాన్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడు. సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన ధాకడ్ రామ్ సిహాగ్ అనే దుండగుడిని రాజస్థాన్ పోలీసులు గతేడాది అరెస్టు చేశారు. సల్మాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉండటంతో భద్రతను కల్పించారు పోలీసులు.