రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆలూరు.. ఈ ప్రాంతంలో కరువును నివారించాలని 8 టీఎంసీల సామర్థ్యంతో వేదవతి ప్రాజెక్టు చేపడితే.. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ దుర్మార్గుడు 3 టీఎంసీలు తగ్గించాడు.. నిధులు ఇవ్వలేక ప్రాజెక్టును కూడా ఆపేసి కరువు రైతులకు తీరని ద్రోహం చేశాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా శుక్రవారం ఆలూరు అంబేడ్కర్ సర్కిల్‌లో జరిగిన రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బి.వీరభద్రగౌడు, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజుతో కలిసి చంద్రబాబు రోడ్‌షోలో మాట్లాడారు. ప్రజాగళం యాత్ర సభకు జనం పోటెత్తారు. ఎల్లార్తి రోడ్డు, ఆదోని రోడ్డు, బళ్లారి రోడ్డు ఎటు చూసినా జనం.. జనం ప్రభంజనమే. ఉప్పొంగిన ఉత్సాహంతో సైకో పోవాలి.. సైకిల్ రావాలనే పాటకు తెలుగు యువత కార్యకర్తలు చిందులు వేశారు. బాబు ప్రశ్నలకు జగన్ గుండెల్లో దడ పుట్టేలా ప్రజలు సమాధానం ఇచ్చారు. ఈ దుర్మార్గుడు మాకొద్దు.. రాక్షస పాలన అంతం చేద్దాం.. సైకిల్‌ను గెలిపిస్తామంటూ ప్రజలు బాబుకు సూచించారు. కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి చంద్రబాబు రెట్టింపు ఉత్సాహంతో ప్రసంగాన్ని కొనసాగించారు. రాబోయే ఎన్డీయే సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంలో ఆలూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామంటూ వరాల జల్లులు కురిపించారు. 8 టీఎంసీలతో వేదవతి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా.. నదిలో నీరు లేకపోతే హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు నింపి కరువు నేలకు మళ్లిస్తా. టమోటా ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తాం. ఆదోనిలో మిరప ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు, డిగ్రీ కళాశాలకు ప్రత్యేక భవనాలు నిర్మాణం. జాతీయ రహదారితోపాటు ఆలూరు, హొళగుంద రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బుడగజంగాలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
![]() |
![]() |