ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు పోలీసులను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుందోని ఎన్నికల కమిషన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈసీకి వర్ల లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికార వైసీపీ చేతిలో పోలీసు యంత్రాంగం పనిచేస్తోందన్నారు. ప్రత్యర్ధులను వేధించడానికి పోలీసులను వైసీపీ అభ్యర్థులు అస్త్రంగా చేసుకున్నారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్ధితో కుమ్మక్కై టీడీపీ అభ్యర్ధి బోండా ఉమాను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు విజయవాడ పోలీసు కమిషనర్ కుట్రపన్నారని విమర్శించారు. అరెస్ట్ చేసిన వ్యక్తుల వద్ద నుంచి బలవంతంగా వాంగ్మూలం నమోదు చేసి బోండా ఉమాను అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. విజయవాడలో వెల్లంపల్లి ఓడిపోతున్నాడని అతని విజయావకాశాలు పెంచడం కోసమే పోలీసులు ఈ పథకం పన్నారని లేఖలో పేర్కొన్నారు. అందుకే ఈ కేసులో బెయిల్ కూడా రాకుండా ఉండడానికి సెక్షన్ 307 ఐపీసీ పెట్టారన్నారు. టీడీపీ దుర్గారావుతో పాటు మరో 20 మంది మహిళలను అదుపులోకి తీసుకొని ఇప్పటి వరకు వారిని ప్రజల ముందు ప్రవేశపెట్టలేదన్నారు. నామినేషన్ వేసిన అభ్యర్ధులను అక్రమంగా అరెస్ట్ చేసి వారిని చిత్రహింసలకు గురి చేసి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు పోలీసులను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.