పెళ్లయిన 5 నెలలకే ఓ యువతి భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. వివాహ జీవితంలో తాను అనుభవించిన మానసిక క్షోభను సూసైడ్ నోట్‌లో రాసుకుని మరీ రైలు కింద పడి తనువు చాలించిన ఈ హృదయ విదారక ఘటన ఏర్పేడులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలం అముడూరు గ్రామానికి చెందిన కవిత ఓ సంస్థలో నర్సుగా పనిచేసేది. ఐదు నెలల క్రితం గాజులమండ్యం ప్రాంతానికి చెందిన బాలాజీ అనే యువకుడితో వివాహం జరిగింది.కొద్ది కాలానికే భార్యాభర్తల మధ్య అనుమానం చిచ్చురేపింది. తన ఫోన్ బిజీ వచ్చినా... ఎప్పుడైనా పనిలో ఉండి ఫోన్ ఎత్తకపోయినా అనుమానంతో తీవ్రంగా వేధించేవాడని కవిత లేఖలో పేర్కొంది. పలు రకాలుగా తనను దారుణంగా బాలాజీ టార్చర్ చేశాడంటూ రాసుకుంది. శనివారం సాయంత్రం అమ్మగారి ఇంటి నుంచి భర్త వద్దకు బయలుదేరిన ఆమె ఏర్పేడులో దిగి రైలు కిందపడి చనిపోయింది. స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రవి, ఏఎ్‌సఐ రమేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా సమీపంలోని అముడూరు గ్రామానికి చెందిన కవితగా గుర్తించారు. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలు బాదుకున్నారు. తమ బిడ్డ వివాహమైన ఐదు నెలలకే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
![]() |
![]() |