ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో శనివారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ చేసిన టీడీపీ నేత వేముల దుర్గారావును పోలీసులు విడుదల చేశారు. గత శనివారం రాత్రి విజయవాడలో ముఖ్యమంత్రి జగన్‌పై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడంతో ఆయన కనుబొమలపై గాయమైన విషయం తెలిసిందే. ఈ కేసులో టీడీపీ నేత దుర్గారావును పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దీనిని నిరసిస్తూ ఆయన కుటుంబసభ్యులు పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. తన భర్త ఆచూకీ చెప్పాలని దుర్గారావు భార్య డిమాండ్ చేశారు.
ఎన్నిసార్లు వేడుకున్నా పోలీసులు కనికరించడం లేదని, నా భర్త ఎక్కడ ఉన్నాడో చూపించండి అంటూ దుర్గారావు భార్య శాంతి కన్నీళ్లు పెట్టుకున్నారు. దుర్గారావు కుటుంబ సభ్యులు, వడ్డెరకాలనీ వాసులు శనివారం ఉదయం విజయవాడ సీపీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అయితే, పోలీసులు వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి తరలించారు. అయితే, శనివారం రాత్రి విజయవాడ నార్త్ ఏసీపీ కార్యాలయంలో దుర్గారావును కుటుంబ సభ్యులకు అప్పగించారు. 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చి.. మళ్లీ అవసరమైతే స్టేషన్‌కు పిలుస్తామని చెప్పి సంతకాలు చేయించుకున్నారు. దుర్గారావు కుటుంబం మాత్రం సంబంధం లేని కేసుల్లో వడ్డెరలను ఇరికిస్తున్నారని ధ్వజమెత్తారు.
మరోవైపు, పోలీసులు విడుదల చేసిన తర్వాత దుర్గారావు మాట్లాడుతూ.. ఏప్రిల్ 16న సింగ్ నగర్ డాబాకొట్ల రోడ్డులోని టీకొట్టు వద్ద టీ తాగుతుంటే పోలీసులు వచ్చి మాట్లాడాల్సిన పని ఉందంటూ వాహనం ఎక్కించారని తెలిపారు. స్టేషన్‌కు తీసుకెళ్లి ఇంటరాగేషన్ చేశారని చెప్పారు. నేను ఏ తప్పూ చేయలేదన్నా వినిపించుకోకుండా.. నీ వెనుక ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారని అన్నారు. అసలు నేను ఆ పని చేయనప్పుడు ఎవరుంటారని గట్టిగా జవాబిచ్చినట్టు పేర్కొన్నాడు. సీసీఎస్‌లో నన్ను, నిందితుడు సతీష్‌ను పక్కపక్క గదుల్లో ఉంచి విచారణ చేశారని అన్నారు. కాగా, ఈ కేసులో నిందితుడు సతీష్‌ను తమ కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పిటిషన్ సిద్ధం చేసినా... మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం నమోదుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.