గిరిజనుల పెద్ద పండగగా భావిస్తున్న ఇటుక పండగ మన్యంలో ఆదివారం ప్రారంభమయ్యింది. చైత్రమాసంలో ఆరు రోజులపాటు ఈ పండగను నిర్వహిస్తారు. తొలిరోజున కుటుంబాల వారీగా బియ్యం సేకరించి గత ఇటుక పండుగ తర్వాత వివాహాలు చేసుకున్న తమ కుటుంబంలో జంటలకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. వారితో కలసి ఒకే ఇంటిపేరున్న కుటుంబీకులంతా భోజనాలు చేస్తారు. రెండో రోజు కొత్త మామిడితో పచ్చడి చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. అలాగే పితృదేవతలకు కొత్త బట్టలు చూపి మూలన మడపాలు పెట్టి పూజిస్తారు. అలాగే తమ పితృదేవతలకు కోడిని మొక్కుబడిగా సాధిస్తారు. మూడో రోజు నేల తల్లికి పూజలు చేస్తారు. థింసా నృత్యాలు చేస్తారు. నాలుగో రోజు ఇటుక పండుగ చేస్తారు. తొలుత గోనస వేట చేస్తారు. దానిని ఽథింసా వాయిద్యాలతో గ్రామాల్లో ఊరేగిస్తారు. దానికి గిరిజన పూజారి పూజలు చేస్తారు. అలాగే తమ గ్రామదేవతలకు పూజలు చేస్తారు. పూజలు అనంతరం గోనస పూజకు స్వస్తి చెబుతారు. అనంతరం వేట ప్రధానంగా ఉంటుంది. వేటకు వేళ్లే వారికి భత్యాన్ని సేకరిస్తారు. భత్యం కింద బియ్యం, డబ్బులు, ఇతర సామాగ్రిని సేకరిస్తారు. ఈ సామగ్రితో వేటకు వేళ్లే వారు అడవుల్లో వంట చేసుకోవడానికి వినియోగిస్తారు. ఐదో రోజున వేట సులభంగా సాగి వీలైనంత పెద్ద జంతువు దొరకాలని ఆశిస్తూ అడవి తల్లికి పూజలు చేస్తారు. ఈసందర్భంగా అడవి తల్లికి నైవేథ్యంగా కోడిని వదిలి పెడతారు. ఆరో రోజు పురుషులు వేటకు బయలుదేరుతారు. వేటకు వెళ్లిన వారు ఏదైన జంతువుతో తిరిగి వచ్చే వరకు మహిళలు ఇంట్లో పనులు చేయరు. బయట పనులకు వెళ్లరు. ఉద్యోగస్తులుంటే మాత్రం గ్రామ కట్టుబాటు ప్రకారం జరిమానా చెల్లించి వెళ్లడానికి మినహాయింపు ఉంది. వేటకు వెళ్లిన వారు వచ్చేవరకు సమీప పట్టణాలకు వెళ్లి థింసా నృత్యాలు చేస్తూ సుంకం వసూలు చేస్తున్నారు. రహదారుల్లో కర్ర అడ్డం పెట్టి వాహనాలను నిలుపుతున్నారు. వాహనదారులు సంతోషంగా ఇచ్చిన సుంకం తీసుకుంటారు. వేటకు వెళ్లిన వారు సకాలంలో తమకు దొరికిన జంతువులో తిరిగి వస్తే దానిని అంతా సమానంగా పంచుకుంటారు. అలాగే సన్నిహితులకు, బంధువులకు నజరానాగా పంపిస్తారు.