హీరో నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమికి షాక్ తగిలింది. ఆధ్యాత్మిక గురువు, శ్రీ పీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బాలయ్య ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. ఇక వైసీపీ నుంచి టీఎన్ దీపిక పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ నుంచి ఎన్నికల బరిలో నిలవాలని పరిపూర్ణానంద భావించారు. కానీ పొత్తులో ఈ సీటు టీడీపీకీ వెళ్లటంతో నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో అసంతృప్తికి గురైన స్వామి పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
దేశంలో హిందూ అనే పేరున్న నియోజకవర్గం ఇదేనని.. అందుకే తాను హిందూపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని పరిపూర్ణానంద స్వామి గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నారు. ఈ కారణంతోనే హిందూపురం అసెంబ్లీ లేదా హిందూపురం ఎంపీ సీటును ఆయన ఆశించారు. కానీ ఆ రెండు సీట్లు ఆయనకు దక్కకపోవటంతో అసంతృప్తికి గురయ్యారు. అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే విలేకర్ల సమావేశం నిర్వహించి.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనకు టికెట్ రాకుండా అడ్డుపడ్డారంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మెత్తబడిన పరిపూర్ణానంద కొన్నిరోజులు సైలెంట్‌గా ఉన్నారు.
అంతా సద్దుమణిగింది అని భావిస్తున్న సమయంలో తాను రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పరిపూర్ణానంద ఇటీవల మరోసారి ప్రకటించారు. తాను బరిలో ఉండకూడదంటే తనకు కొన్ని కండీషన్లు ఉన్నాయంటూ బీజేపీ అధిష్టానం ఎదుట కొన్ని ప్రతిపాదనలు ఉంచారు. ఇన్నేళ్ల నుంచి అభివృద్ధిలో హిందూపురం వెనుకబడి ఉందన్న పరిపూర్ణానంద స్వామిజీ.. హిందూపురం అభివృద్ధిపై బీజేపీ అధిష్టానం స్పష్టమైన హామీ ఇస్తే పోటీ విరమించుకుంటానని స్పష్టం చేశారు. అయితే అటు బీజేపీ నేతల నుంచి కానీ.. ఇటు టీడీపీ వైపు నుంచి కానీ పరిపూర్ణానందను బుజ్జగించే ప్రయత్నాలు చేయలేదు.
దీంతో మరింత అసంతృప్తి వ్యక్తం చేసిన స్వామి పరిపూర్ణానంద.. హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు మరో రెండురోజులు సమయం ఉన్న నేపథ్యంలో హిందూపురం ఎంపీ సీటుకు సైతం నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలుస్తోంది. మొత్తానికి హిందూపురంలో ఎన్డీఏ కూటమికి స్వామివారు కంట్లో నలుసులా మారారని చెప్పొచ్చు.