ఏపీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎండలు, వేడి గాలులతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. రాబోయే రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. రానున్న ఐదు రోజుల్లో ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45.5 డిగ్రీలకు చేరాయి. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా కొత్తవలసలో 44.2, మన్యం జిల్లా సాలూరులో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 41 మండలాల్లో తీవ్రంగా, 116 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచాయి. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరనుంది.
శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని, రాష్ట్రవ్యాప్తంగా 183 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు పెరిగిన నేపథ్యంలో గర్భిణిలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.
మరోవైపు మన్యంలో శుక్రవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండ మండిపోగా.. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. వాతావరణం పూర్తిగా చల్లబడడంతో జనం ఉపశమనం పొందారు. భారీ వర్షానికి జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాడేరుతో పాటు ఏజెన్సీలోని పలు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొయ్యూరులో శుక్రవారం 43.0 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అరకులోయలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ తరువాత ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి గంటన్నర సేపు ఏకధాటిగా వర్షం కురిసింది. వడగళ్లతో కూడిన వాన కురవడంతో జనజీవనానికి ఇబ్బందులు ఎదురయ్యాయి.
జి.మాడుగుల మండలంలో శుక్రవారం ఉదయం ఎండ ఎక్కువగా ఉండగా, మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంతో పాటు కె.కోడాపల్లి, భీరం, సింగర్భం పంచాయతీల పరిధిలో పలు చోట్ల భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. డుంబ్రిగుడ మండలంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రతకు చాపరాయి జల విహారి ప్రాంతం నిర్మానుష్యంగా కనిపించింది. మధ్యాహ్నం మూడు గంటల తరువాత వర్షం కురిసింది.
దక్షిణాదిలో ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, వీటికి ఆనుకుని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలోని అనేక ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగడమే కాకుండా వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు ఈశాన్య భారతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశాలో తొమ్మిది జిల్లాలకు వడగాడ్పుల హెచ్చరికలను ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీచేసింది. అలాగే 26-28వ తేదీల మధ్య కేరళలో, 27-29 మధ్య కొంకణ్ ప్రాంతంలో, 28-30 మధ్య పశ్చిమ ఉత్తరప్రదేశ్, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో పంజాబ్ హరియాణాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది.