దేశ రాజధాని ఢిల్లీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ జరగలేదు. దీనిపై దాఖలైన పిటిషన్‌పై విచారణను చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల కంటే మీకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని ప్రశ్నించింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన కేజ్రీవాల్.. సీఎం పదవికి రాజీనామా చేయకపోవడం, ఆ బాధ్యతలను ఇతరులకు అప్పగించకపోవడంతో ఢిల్లీలో ప్రభుత్వ పాలన స్తంభించిపోతోందని పరోక్ష వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇంకా పుస్తకాలు అందలేదని ఓ స్వచ్ఛంద సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ చేపట్టిన కోర్టు.. ఢిల్లీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించగా.. పుస్తకాలు పంపిణీ చేసేందుకు సీఎం ఆమోదం అవసరమని తెలిపారు. కానీ ప్రస్తుతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నారని లాయర్ చెప్పడంతో ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
ఢిల్లీలోని విద్యార్థులు, ప్రజల ప్రయోజనాల కన్నా.. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకే అరవింద్ కేజ్రీవాల్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు మండిపడింది. దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యమైనవని ఇప్పటివరకు తాము ఎంతో సంయమనంతో చెబుతూ వచ్చామని.. కానీ ఇది తప్పని రుజువవుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌పై తాము సోమవారం ఆదేశాలు జారీ చేస్తామని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ తెలిపారు.
ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్.. సీఎం పదవికి అనర్హుడని.. తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అలాంటి విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. పాలనాపరమైన విషయాల్లో తాము ఆదేశాలు జారీ చేయలేమని గతంలో స్పష్టం చేసింది.