కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేరుతో ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసి.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న వీడియో వైరల్ కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రస్తుతం దేశంలో ఎన్నికల వేడి కొనసాగుతున్న వేళ.. ఇలాంటి వీడియోలు వైరల్ కావడంతో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి కారణం అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ వయనాడ్ స్థానానికి రెండో విడత పోలింగ్‌లో భాగంగా శుక్రవారం ఎన్నికలు కూడా జరిగాయి.
అయితే ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వయనాడ్ పార్టీ యూనిట్ పేరుతో ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. రాహుల్ గాంధీ ఫేక్ వీడియోపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వయనాడ్ జిల్లా కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేశంలోని మత సామరస్యాన్ని ధ్వంసం చేయడం, పార్టీని ప్రతికూలంగా చిత్రీకరించడమే లక్ష్యంగా ఈ వీడియో ఉందని హస్తం పార్టీ నేతలు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదుతో పాటు సంబంధిత వైరల్ వీడియో కాపీని కూడా ఆ పార్టీ పోలీసులకు అందజేసింది. ఈ వీడియో తీసిన వారిపై, వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అంతేకాదు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఆ వీడియోను తొలగించాలని కూడా కోరింది.
రాహుల్ గాంధీ పేరుతో వైరల్ అవుతున్న ఆ వీడియో.. దేశంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకంగా చూపించాలనే దురుద్దేశంతోనే రూపొందించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక వయనాడ్ స్థానానికి శుక్రవారం ఎన్నికలు జరిగాయి. ఈ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా.. బీజేపీ తరఫున కే సురేంద్రన్, సీపీఐ నుంచి అన్నీ రాజా బరిలో నిలిచారు. 2019 ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నుంచి, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీకి.. అమేథీలో గట్టి ఎదురుదెబ్బ తగలగా.. వయనాడ్‌లో మాత్రం ఘన విజయం దక్కింది.