ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. పార్టీ అధినేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు అవిశ్రాంతగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా.. బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కిందపడిపోయారు. హెలికాప్టర్ ఎక్కుతుండగా.. ఆమె ఒక్కసారిగా జారి పడిపోయారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ నుంచి అసన్ సోల్‌కు వెళ్లేందుకు మమతా బెనర్జీ హెలికాప్టర్ ఎక్కారు. ఈ క్రమంలోనే లోపలికి వెళ్లి సీట్లో కూర్చునే సమయంలో ఆమె ఒక్కసారిగా పట్టు తప్పి కింద పడిపోయారు.
మమతా బెనర్జీ హెలికాప్టర్ ఎక్కుతూ పడిపోవడాన్ని అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గమనించి వెంటనే ఆమెకు సాయం చేశారు. కింద పడిన దీదీని పైకి లేపి.. సీట్లో కూర్చొబెట్టారు. ఈ ఘటనలో దీదీకి చిన్న గాయం అయిందని టీఎంసీ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన తర్వాత ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. అనంతరం అసన్‌సోల్ వెళ్లి అక్కడ ప్రచారం చేసినట్లు వివరించారు. హెలికాప్టర్ ఎక్కుతుండగా.. మమతా బెనర్జీ కింద పడిపోయిన సంఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నటుడు, సిట్టింగ్ ఎంపీ శత్రుఘ్న సిన్హా పోటీ చేస్తున్నారు. శత్రుఘ్న సిన్హాకు మద్దతుగా మమతా బెనర్జీ నేడు అసన్‌సోల్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఇక ఇటీవలె మమతా బెనర్జీ తన ఇంట్లో జారిపడటంతో గాయం అయింది. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా.. దీదీ గాయపడినట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. దానికి సంబంధించి ఆమె నుదుటి నుంచి రక్తం కారుతున్న ఫోటోను టీఎంసీ ట్వీ్ట్ చేసింది. ఆ తర్వాత తలకు కట్టు కట్టుకుని.. మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
అంతకుముందు గతేడాది జూన్‌లో దీదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో ఆ హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ తర్వాత హెలికాప్టర్ నుంచి కిందకి దిగుతుండగా.. మమతా బెనర్జీ గాయపడ్డారు. దీంతో ఆమె మోకాలు, తుంటి లిగ్‌మెంట్లకు గాయాలు అయ్యాయి.